తిరుపతిలో శ్రీవారి భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు ఆటో డ్రైవర్లు. ఒక ప్రాంతం నుంచే మరో ప్రాంతానికి వెళ్ళేందుకు భక్తులు ఆటోలను ఆశ్రయిస్తుంటే వారు భక్తుల వద్ద అధి కమొత్తంలో డబ్బులను వసూలు చేసేస్తున్నారు. తిరుపతిలో ఆటోడ్రైవర్ల ఆగడాలపై ప్రత్యేక కథనం.
తిరుపతి.. ప్రపంచంలోనే పేరెన్నిగల ఆధ్మాత్మిక క్షేత్రం. తిరుపతికి ప్రతిరోజు 50 నుంచి 60వేల మంది భక్తులు వస్తూ పోతుంటారు. అందులో బస్సులు, రైళ్ళ ద్వారా వచ్చే ప్రయాణీకుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. తిరుపతికి వచ్చే భక్తులు స్థానికంగా ఉన్న తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట, గోవిందరాజస్వామి ఆలయంలకు వెళ్ళడానికి ఆటోలను ఆశ్రయిస్తుంటారు.
తిరుపతి నుంచి తిరుచానూరుకు 7 కిలోమీటర్ల దూరం ఉంది. మామూలుగా అయితే 50 నుంచి 70 రూపాయల్లోగా ఆటోడ్రైవర్లు తీసుకోవాలి. కానీ 300 నుంచి 400 రూపాయల వరకు భక్తుల వద్ద వసూలు చేస్తున్నారు. అంతేకాదు శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్ళడానికి 120 నుంచి 150 రూపాయలు తీసుకోవాలి.
కానీ 500 నుంచి 600 రూపాయలను ఆటోడ్రైవర్లు వసూలు చేసేస్తున్నారు. గోవిందరాజస్వామి ఆలయం రైల్వేస్టేషన్‌కు అతిసమీపంలో ఉంది. అయితే కొంతమంది భక్తులకు ఆలయం తెలియకపోవడంతో ఆటోడ్రైవర్లు సులువుగా వారిని మోసం చేసేస్తున్నారు. పక్కనే ఉన్న రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి పట్టణంలోని నాలుగు ఐయిదు వీధులను తిప్పుతూ తిరిగి ఆలయం వెనుక భాగం నుంచి భక్తులను తీసుకొచ్చి విడిచిపెట్టి 200 రూపాయలకుపైగా వసూలు చేసేస్తున్నారు.