తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాలు...

ఆదివారం, 14 జనవరి 2018 (08:22 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. నగర వాసులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటలతో సంక్రాంతి పండుగను ఆహ్వానించారు. ముచ్చటైన మూడ్రోజుల పండగతో ప్రతి ఇంటా సంబురాలు మొదలయ్యాయి. ఈ మూడు రోజుల పండుగ భోగితో ఆరంభమై.. సంక్రాంతితో కొనసాగింపుగా… కనుమతో ముగియనుంది. ఈ పెద్ద పండుగను ఘనంగా జరుపుకునేందుకు అప్పుడే అందరూ తమతమ సొంతిళ్లకు చేరారు. ఆదివారం వేకువజామున భోగి మంటలతో చిన్నా పెద్ద కలిసి అర్థరాత్రి ఆటలాడారు.
 
భోగి పండుగతో సంక్రాంతి పర్వదినాలు ఉత్సాహంగా ప్రారంభమవుతాయి. తెల్లవారుఝామునే ఇంటిముంగిట కళ్ళాపి జల్లి, రంగురంగుల రంగవల్లికలను వేసి, ఆ ముగ్గుల మధ్య పేడముద్దలతో గొబ్బెమ్మలు పెడతారు. కన్నెపిల్లలంతా గొబ్బి పాటలు పాడతారు. పాతవి, విరిగినవి, పనికిరానివి అయిన కలపను, కర్రలను, వస్తువులను భోగిమంటల్లో వేసి, ‘భోగి’ పీడ విరగడైనట్లుగా భావించే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. భోగి మంటల్లో కాచిన వేడి నీళ్ళతో తలంటు స్నానం చేసి, భవద్ధర్శనం చేయడం ఎంతగానో శ్రేయస్కరం. 
 
ఇకపోతే, హైదరాబాద్ ‌- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండగ సందర్భంగా స్వగ్రామాలకు ప్రజలు బయలుదేరడంతో శుక్రవారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు తరలివస్తున్న విషయం విదితమే. శనివారం ఉదయం నుంచి రద్దీ మళ్లీ మొదలైంది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర వద్ద ట్రాఫిక్‌ను పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వరకు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు 16 వేల వాహనాలు వెళ్లినట్లు కీసర వద్ద ఉన్న టోల్‌ప్లాజా సిబ్బంది వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు