బాబు రాసాడు.. మోదీ చేసాడు.. క్రెడిట్ కోసం పాకులాడితే తిట్లు తినాల్సి వ‌స్తోందా....

శుక్రవారం, 18 నవంబరు 2016 (21:09 IST)
విజ‌య‌వాడ‌: 500, 1000 నోట్లను రద్దు చేయమని చెప్పింది నేనే.. ప్ర‌ధాని మోదీకి లెట‌ర్ కూడా రాశా... అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తరచూ చెప్పిన మాటలు ఇపుడు పార్టీ మెడ‌కు చుట్టుకుంటున్నాయి. ప్రధాని మోదీ నల్లధనం అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేశారంటే.. ఆ క్రెడిట్ దక్కాల్సింది ముమ్మాటికీ సీఎం చంద్రబాబుకే! అని మొద‌ట్లో టీడీపీ నాయ‌కులు ఎలుగెత్తి చాటారు. 
 
కానీ, ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బంది కావ‌డంతో సీన్ రివర్స్ అయ్యింది. అన్నిచోట్లా చిల్ల‌ర‌కు ఇబ్బంది... ప‌నుల్లేవు. వ్యాపారాలు లేవు... ఏ రంగంలోనూ ఒక్క అడుగు కూడా ముందుకు క‌ద‌ల‌డం లేదు... బ్యాంకుల వ‌ద్ద‌, ఏటీఎంల వ‌ద్ద జ‌నం క్యూక‌ట్టి... మాకిదేం ఖ‌ర్మ అని తిట్టి పోస్తున్నారు. ఇక ప‌ల్లెటూర్ల‌లో అయితే, “బాబు రాసాడు.. మోడీ చేసాడు.." అంతా క‌ల‌సి జ‌నాల్ని చావ‌గొడుతున్నార‌ని అంటూ తిట్టిపోస్తున్నారు. దీంతో టీడీపీ ఇమేజ్ డామేజ్‌లో ప‌డుతోంద‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఫీడ్ బ్యాక్ వ‌చ్చినట్లు సమాచారం. దీనితో డిఫెన్స్‌లో ప‌డిన బాబు... కేంద్రానికి నోట్ల కోసం అభ్య‌ర్థ‌న లేఖ రాశారు. 
 
మ‌రో ప‌క్క రాష్ట్ర ఆర్థిక మంత్రి ఖ‌జానా ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆర్ధిక శాఖ కార్య‌ద‌ర్శి అయితే, జీతాలు కూడా అతి క‌ష్టంపై ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ప‌రిస్థితుల‌పై చంద్రబాబు సమీక్షలతో చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రానికి కొత్త నోట్లు ఎక్కువ పంపాలని కేంద్ర ఆర్ధిక శాఖకు లేఖ రాశారు. జిల్లాలో క్యాష్ క్లస్టర్‌లు మానిటరింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
డ్వాక్రా మహిళలతో ఈ పాస్ మిషన్లతో లావాదేవీలు నడపాలని రైతు బజార్లు గ్యాస్ ఏజెన్సీలు, సూపర్ మార్కెట్ల దగ్గర డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తేవడానికి రంగం సిద్ధం చేశారు. నేషనల్ పేమెంట్ కమిషన్ సంస్థతో సమావేశం నిర్వహించి మొబైల్ ఫోన్లతో కరెన్సీ మార్పిడి విధానం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా డ్యామేజీని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నంలో అధికార పార్టీ ఉంది.

వెబ్దునియా పై చదవండి