మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

దేవీ

శుక్రవారం, 1 ఆగస్టు 2025 (19:37 IST)
Mitra Mandali second song poster
బన్నీ వాస్ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా 'స్వేచ్ఛ స్టాండు' విడుదలైంది.
 
'మిత్ర మండలి' నుంచి మొదటి గీతంగా విడుదలైన 'కత్తందుకో జానకి' అందరూ సరదాగా పాడుకునేలా ఉండి, సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు రెండవ గీతంగా వచ్చిన 'స్వేచ్ఛ స్టాండు' కూడా అంతే సరదాగా ఉంది. 
 
ఆర్.ఆర్. ధృవన్ స్వరపరిచిన ఈ పాటకు ఆర్.ఆర్. ధృవన్, విజయేందర్ ఎస్ సంయుక్తంగా సాహిత్యం అందించారు. తేలికైన ఇంగ్లీష్ పదాలతో సరదా సరదాగా ఈ గీత రచన ఉంది. 'వై దిస్ కొలవెరి' శైలిలో సాగిన 'స్వేచ్ఛ స్టాండు' గీతం.. ఆ పాట శైలిలోనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించేలా ఉంది.
 
ధనుంజయ్ సీపాన, ఆర్.ఆర్. ధృవన్ ల గానం ఈ పాటను ఉత్సాహభరితంగా మార్చింది. కథానాయిక దృష్టిలో పడటం కోసం కథానాయకులు వచ్చీరాని ఇంగ్లీష్ పదాలతో పాట పడటం భలే సరదాగా ఉంది. ముఖ్యంగా ఈ తరం శ్రోతలకు నచ్చేలా 'స్వేచ్ఛ స్టాండు' గీతం సాగింది. 
 
వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఛాయాగ్రాహకుడిగా సిద్ధార్థ్ ఎస్.జె, కళా దర్శకుడిగా గాంధీ నడికుడికర్ వ్యవహరిస్తున్నారు. పీకే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్స, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.
 
టీజర్, 'కత్తందుకో జానకి' గీతం ఆకట్టుకొని 'మిత్ర మండలి' చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు ఈ 'స్వేచ్ఛ స్టాండు' గీతం ఆ అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. 
 
'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. బాధలన్నీ మర్చిపోయి, థియేటర్లలో మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు