ఏపీలో వినాయకచవితిని జరుపుకోవాలనుకుంటున్న భక్తులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన విమర్శలపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. గణేశ్ ఉత్సవ వేడుకలపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు, చేపడుతున్న ఆందోళనలపై ముఖ్యమంత్రితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కర్నూలులో సోము వీర్రాజు మాట్లాడిన మాటలు రాజకీయ డ్రామాల్లో భాగమేనని అన్నారు.
రాష్ట్రంలో ఎవరినైనా వినాయకచవితి వేడుకలు జరుపుకోవద్దని ఎవరైనా చెప్పారా? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పండుగలు జరుపుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బీజేపీ నేతలవి మత రాజకీయాలని... కావాలనే జగన్ పాలనపై మతం ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల వారికి సమానంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత జగన్ దని అన్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటిస్తూ వినాయకచవితిని సురక్షితంగా జరుపుకోవాలని చెప్పారు.