ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో రూ.10 కోట్ల అవినీతి జరిగిందని, రెండెకరాల రైతును అని చెప్పుకొనే చంద్రబాబుకు రూ.లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
కేంద్ర నిధులతో పనులు చేస్తూ ఆ పథకాలకు ప్రధాని మోడీ ఫోటో పెట్టుకోవడం లేదని మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు అవినీతికి వారసులని, తాము నిప్పులాంటి వాళ్లమని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే అవినీతిపై స్పందిస్తున్నామని కూడా జోడించారు. దీంతో బీజేపీ.. టీడీపీ పొత్తుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి.