బీజేపీ నేతలను అడ్డుకుంటే రాష్ట్రం తగలబడిపోతుంది: విష్ణువర్ధన్‌ రెడ్డి

మంగళవారం, 5 జనవరి 2021 (20:55 IST)
విజయనగరం జిల్లా రామతీర్థం సందర్శనకు బయలుదేరిన బీజేపీ నేతలను అడ్డుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలని రామతీర్థంకు అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని హెచ్చరించారు.
 
జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలన్నారు. రామతీర్థం కొండ మీదికి టీడీపీ, వైసీపీని అనుమతించి తమను అడ్డుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయండని ఆయన యెద్దేవా చేశారు. 
 
పోలీసులకి జీతాలు ఇస్తోంది వైసీపీ ఆఫీసా.. లేక రాష్ట్ర ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ఏపీలో మనవహక్కుల ఉల్లంఘనపై పోలీసుల దమన కాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. 60ఏళ్ల వయసున్న సోమువీర్రాజుని అరెస్ట్ చేయడం జగన్ పరికిపంద చర్యగా వ్యాఖ్యానించారు. 
 
ఏపీలో పోలీసుల ప్రభుత్వం నడుస్తోందని.. పోలీసుల వైపల్యం వలనే వరుస సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు