తమ్ముడి భార్య అంటే సోదరితో సమానం. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లా ఆమెను చూసుకోవాలి. కానీ బావ మాత్రం తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆమెతో శారీరక సుఖం కోసం పాకులాడాడు. ఎన్నోసార్లు అత్యాచారయత్నం చేసినా భరించింది. సొంత మనిషి కదా ఇంట్లో గొడవలు ఎందుకులే అని ఊరుకుంది. అదే ఆమెకు శాపంగా మారింది. చివరకు ఆమె ప్రాణాలు బలిగొనేలా చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా మొగుల్తూరు మండలం పేరుపాళెంకు చెందిన అన్నారావు, సత్యవతిల ఏకైక కుమార్తె గీతాసురేఖను 12 సంవత్సరాల క్రితం శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు. శ్రీనివాసరావు ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. సొంత స్టూడియో నడుపుతున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గత సంవత్సరం క్రితం శ్రీనివాసరావుకు రోడ్డు ప్రమాదం జరిగి మతిమరుపు మొదలైంది. భార్యతో సరిగ్గా కాపురం కూడా చేయడం లేదట. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీనివాసరావు సోదరుడు శివశంకర్, మరదలు గీతపై కన్నేశాడు. శ్రీనివాసరావు బయటకు వెళ్ళిన సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు.
బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఒంటరిగా ఉన్న గీతను బలాత్కారం చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో శరీరంపై తీవ్రగాయాలయ్యాయి. గట్టిగా కేకలు పెట్టడంతో శివశంకర్ పారిపోయాడు. అప్పటికే ఇరుగుపొరుగు రావడంతో విషయం కాస్త బయటకు పొక్కింది. దీంతో మనస్థాపానికి గురై ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితుడి కోసం పోలిసులు గాలిస్తున్నారు. తల్లి గీతాసురేఖ మృతితో ఇద్దరు పిల్లలు బోరున విలపిస్తున్నారు.