కర్నూలు జిల్లాలో పరువు హత్య.. భర్తకు విడాకులిచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకుందనీ!

సోమవారం, 25 జులై 2016 (10:56 IST)
కర్నూలు జిల్లాలో పరువు హత్య జరిగింది. భర్తకు విడాకులిచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకున్నందుకు సొంత అన్నలే ఆ మహిళను దారుణంగా కొట్టి చంపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన కృష్ణమ్మ(18), కామనదొడ్డి గ్రామానికి చెందిన ఈరన్న అనే యువకుడిని ప్రేమించుకున్నారు. ఈ విషయం దాచిపెట్టి ఆమె కుటుంబసభ్యులు కృష్ణమ్మకు నాలుగు నెలల క్రితం చిర్తనకల్లు గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో పెళ్లి జరిపించారు. కాపురం చేయడం ఇష్టంలేక కొద్ది నెలలకు పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి కృష్ణమ్మ ప్రభాకర్‌ నుంచి విడాకులు పొందింది. 
 
అనంతరం పోలీసుల సమక్షంలో కృష్ణమ్మ, ఈరన్న పెళ్లిచేసుకున్నారు. పెళ్లి జరిగిన మూడు రోజులకు కృష్ణమ్మ ఇంటికి అన్న బసవరాజు వచ్చాడు. పని ఉందంటూ బండిమీద ఎక్కించుకున్న ఊరి బయటకు తీసుకెళ్లాడు. పథకం ప్రకారం అప్పటికే కాపుకాసిన ఇంకో అన్న ఎల్లారెడ్డితో పాటు బంధువులంతా కలిసి కృష్ణమ్మను కొట్టి చంపారు. తర్వాత శవాన్ని మూగలదొడ్డి చెరువులో పడేశారు. 
 
పశువుల కాపరులు శవాన్ని గుర్తించి గ్రామస్థులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాపు చేపట్టిన పోలీసులు మొత్తం 12 మంది నిందితులను ఆదివారం స్థానిక దొరలజిన్న సమీపంలో అరెస్టు చేశారు. సమావేశంలో ఆదోని రూరల్‌ సీఐ దైవ ప్రసాద్‌, కోసిగి సీఐ రాముడు, ఎస్సై ఇంతియాజ్‌ బాషా, ట్రైనీ ఎస్ఐ రాజారెడ్డి, పెద్దకడబూరు ఎస్ఐ నాగరాజు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి