రవాణాశాఖలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి

శుక్రవారం, 11 అక్టోబరు 2019 (06:50 IST)
రవాణాశాఖకు సంబంధించిన అన్ని సర్వీసులను ఆన్లైన్ విధానంలో ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు కోరారు. 
 
స్థానిక బందరురోడ్డులోని  డిటిసి కార్యాలయం నుండి గురువారంనాడు డిటిసి మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్లు, వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధిత పనులన్ని ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చని, మీ స్మార్ట్ మొబైల్ ఫోన్ ద్వారా కూడా సేవలను పూర్తిస్థాయిలో పొందవచ్చునని, ఈపనుల నిమిత్తం ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు వెళ్లినవసరంలేదని డిటిసి తెలిపారు.

డ్రైవింగ్ లైసెన్స్ కు వాహన రిజిస్ట్రేషన్ కు ముందుగా ఆధార్ అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది. ఆధార్ అనుసంధానంను మీ మొబైల్ లో OTP నెంబర్ ద్వారా కూడా చేసుకోవచ్చని ,లేదా మీదగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ లలో, ఈసేవ, మీసేవ సెంట్రల్ లలో గాని ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.

ఆధార్ అనుసందనానికి ఎటువంటి ప్రభుత్వ ఫీజులు చెల్లించనవసరం లేదన్నారు. ఆధార్ అనుసంధానం చేసిన తరువాత కామన్ సర్వీస్ సెంటర్ లలో సంబంధిత పనుల కోసం ప్రభుత్వ ఫీజుతో పాటుగా  50 రూపాయిలు అదనంగా చెల్లించాలన్నారు.

www.aprtacitizen.epragathi.org వెబ్ సైట్ ద్వారా, మీ స్మార్ట్ ఫోన్ నెంబరుకు OTP నెంబరు ద్వారా గాని డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, చిరునామా మార్పు, 2వతరగతి వాహనానికి లెర్నర్ లైసెన్స్ మొదలగునవి దాదాపు 30 సర్వీసులను మీ ఇంటివద్ద నుండే పొందవచ్చన్నారు.

ఏ పనికి ఎంత ఫీజుల చెల్లించాలో ఫీజుల వివరాలను కూడా రవాణాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. వాహన రిజిస్ట్రేషన్ సంబంధించిన అన్ని సేవలను కూడా ఆన్లైన్లో ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు.

ఆన్లైన్లో మీరు చేసుకున్న దరఖాస్తుకు సరైన పత్రాలను అప్లోడ్ చేసినట్లయితే దరఖాస్తును తిరస్కరించడం జరగదని, అన్ని పత్రాలను సరిగా అప్లోడ్ చేసినా కూడా దరఖాస్తును తిరస్కరించినట్లయితే నా నెంబర్ కు వాట్సాప్ లో తెలియజేయవచ్చని ఆయన అన్నారు.

ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తులను వివిధ కేటగిరిలో పరిశీలించి ఆమోదించడం జరుగుతుందని, దరఖాస్తుల పరిశీలించుటకు మూడు, నాలుగు రోజుల సమయం పడుతుందని డిటీసీ తెలిపారు. మధ్యవర్తులు గాని దళారులు గాని మీ దరఖాస్తులను త్వరగా ఆమోదింపచేస్తామంటే నమ్మవద్దని, సీరియల్ నెంబర్ వారిగా మాత్రమే దరఖాస్తులను ఆమోదించుట జరుగుతుందని తెలిపారు.

ఆన్లైన్లో దరఖాస్తులు ఆమోదం పొందే క్రమంలో వారం రోజులలోపు మొబైల్ కు మెసేజ్ రాకపోయినా,  కార్యాలయంలో పనులు చేసేందుకు అధికారులు గాని ఉద్యోగులు గాని డబ్బులు ఆశించినా, రవాణాశాఖ సేవలలో ఎలాంటి ఇబ్బందులకు గురైనా అట్టి వివరాలను నా మొబైల్ వాట్సాప్ నెంబరు 98481 71102 కు గాని, కార్యాలయ నెంబరు 0866 2970045 గాని తెలుపువచ్చన్నారు.

తిరుగుటప స్మార్ట్ కార్డులను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించే ప్రక్రియ ఆలస్యం కారణంగా నెలఓ రోజులు సమయం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

మీ స్మార్ట్ కార్డ్ వివరాలను www.aprtacitizen.epragathi.org లో ట్రాక్ యువర్ స్మార్ట్ ఈకార్డ్ స్టేటస్ లో పోస్టల్ ట్రాక్  నెంబరును తెలుసు కోవచ్చని, దానిద్వారా www.indiapost.gov.in లో Track Consignment లో పూర్తి వివరాలను పొందవచ్చని డిటీసీ తెలిపారు. మెరుగైన సేవలు అందించే క్రమంలో ప్రజలందరూ ఉపయోగించుకోవాలని డిటిసి వెంకటేశ్వరరావు కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు