బీకాంలో ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటూ వాదించిన జలీల్‌కు విద్యాశాఖా..? ఓలమ్మో...!!

శుక్రవారం, 31 మార్చి 2017 (18:33 IST)
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఏప్రియల్ 2 అని అంటున్నారు. ఈలోపు రకరకాల ఊహాగానాలు, రకరకాల ఈక్వేషన్లు వచ్చేస్తున్నాయి. ఆ మంత్రి పదవి వూడుతుందంటే ఈ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందంటూ రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే ఫైనల్ లిస్టు అంటూ ఓ జాబితా తిరుగుతోంది. ఈ జాబితాలోకి కొత్తగా మరో పేరు వచ్చి చేరింది. అదే జలీల్ ఖాన్.
 
పదో తరగతి పేపర్ లీకేజ్ అంటూ ప్రతిపక్షం నానా గొడవ చేసింది కదా... ఈ నేపధ్యంలో విద్యా శాఖను గంటా శ్రీనివాసరావు నుంచి తీసేసి దాన్ని జలీల్ ఖాన్ కు అప్పగిస్తారంటూ కొత్త ప్రచారం జరుగుతోంది. ఐతే ఆయనకు విద్యాశాఖ అనగానే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అంతే వేగంగా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. ఈమధ్య జలీల్ ఖాన్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ... తను బికాం డిగ్రీ చేశాననీ, ఫిజిక్స్ సబ్జెక్టుగా తను చదివినట్లు చెప్పారు. దానితో బికాంలో ఫిజిక్స్ ఏంటి ఎమ్మెల్యేగారూ అంటూ సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయనకు విద్యాశాఖ ఎలా అప్పగిస్తారంటూ చర్చ జరుగుతోంది. మరి ఈ విస్తరణలో జలీల్ కు పదవి దక్కుతుందా... గంటాకు పదవి పోతుందా... ఏమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి