దోచుకునేందుకే రాజధాని మార్పు: కన్నా

గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:17 IST)
వైకాపా ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని మండిపడ్డారు.

వైకాపా ప్రభుత్వం ఎంతసేపు దోచుకునేందుకే ఆలోచిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు కొన్ని తాయిలాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

విశాఖ రాజధాని అయితే తమ ప్రశాంతతకు భంగం కలుగుతుందని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. విజయనగరం జిల్లా ప్రజలు కూడా విశాఖలో రాజధాని వద్దంటున్నారు.

విశాఖలో బాగా దోచుకోవచ్చనే ఈ నిర్ణయం. విశాఖలో స్థిరాస్తి వ్యాపారం బాగా చేసుకోవచ్చనే యోచనతోనే రాజధాని మార్పు చేస్తున్నారు. ఆర్టీసీ, విద్యుత్‌, మద్యం ధరలు బాగా పెంచారు. వైకాపా ప్రభుత్వ అవినీతిపై మా పోరాటం ఉద్ధృతం చేస్తాం అని కన్నా తెలిపారు.

రాజధాని అనేది 29 గ్రామాల సమస్య కాదని.. రాష్ట్రాభివృద్ధి సమస్య అని కన్నా అభిప్రాయపడ్డారు. గత సీఎం రైతుల భూములతో స్థిరాస్తి వ్యాపారం చేయాలని చూశారని.. ఇక్కడ దోచుకునేందుకు ఏమీ లేదని ప్రస్తుత సీఎం విశాఖ వెళ్తున్నారని విమర్శించారు.

ప్రజల రక్తం పీల్చేలా వైసీపీ పాలన సాగుతోందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 2 కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ప్రజలు నలిగిపోతున్నారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం రావణకాష్ఠంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు