76వ రోజుకు రాజధాని రైతుల ఆందోళనలు

సోమవారం, 2 మార్చి 2020 (04:55 IST)
రాజధాని రైతుల ఉద్యమం 76 రోజులకు చేరిన సందర్భంగా అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి భూములిచ్చి విశాఖ వాసులు మోసపోవద్దని కోరారు.

రాజధాని కోసం తాము ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వడమేంటని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 76వ రోజు రాజధాని రైతులు, మహిళలు దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకునే వరకూ ఉద్యమం ఉద్ధృతమవుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

తొమ్మిది నెలల వైకాపా పాలనలో ఏకపక్ష, స్వతంత్ర నిర్ణయాలే కనిపిస్తున్నాయి తప్ప... రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని... అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పొలం తప్ప మరో వ్యాపకం తెలియని అన్నదాతలపై పంతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుంది అనే మాట ముఖ్యమంత్రి నోటివెంట వస్తే తప్ప... ఆందోళనలు విరమించేది లేదని ప్రకటించారు.

రాజధాని కోసం భూసమీకరణకు 75 శాతం భూములను ధారాదత్తం చేసి 25 శాతం మాత్రమే తాము వెనక్కి తీసుకుంటే... తమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు, 24 గంటల దీక్షలతో హోరెత్తిస్తున్న అన్నదాతలు
మున్ముందూ ఇదే జోరు కొనసాగిస్తామని ప్రకటించారు. 'ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఆగదు' పెరుగుతున్న మద్దతు రైతుల ఆందోళనలకు... కడప జిల్లా రాయచోటి సహా కర్ణాటక, హైదరాబాద్‌ల నుంచి అనేక మంది సంఘీభావం తెలిపారు.

రాజధాని వాసులకు జరుగుతున్న అన్యాయం చూసి చలించపోయామని వాపోయారు. అమరావతిలో రైతులకు ఇళ్ల నిర్మాణం పూర్తయినా ..ప్రభుత్వం ఎందుకు కేటాయించడం లేదని మండిపడ్డారు.

న్యాయం కోరుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అణచివేత ధోరణి అవలంబిస్తున్నారంటూ ఆక్షేపిస్తున్నారు. రాజధానికి భూములిస్తే... బయటివారికి పంచిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు