నిపుణుల కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధాని: బొత్స

గురువారం, 24 అక్టోబరు 2019 (05:20 IST)
ఏపీ రాజధానిపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణుల కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధాని అని బొత్స చేసిన వ్యాఖ్యలు రాజధాని మార్పుపై మరోసారి చర్చకు దారితీశాయి.

రాజధానికి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, రాజధాని కోసం లక్ష ఎకరాలు ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని బొత్స వ్యాఖ్యానించారు. శాశ్వత రాజధానిని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించడం కొసమెరుపు. అమరావతిని శాశ్వత రాజధానిగా మంత్రి బొత్స పరిగణించడం లేదని తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.
 
అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని, రాజధాని ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని బొత్స చేసిన వ్యాఖ్యలు ఏపీలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.

గతంలో కూడా అమరావతిపై బొత్స ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాజధానిని అమరావతిలో నిర్మించడం వల్ల భారీ వ్యయం అవుతుందని, అలా జరిగితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని బొత్స గతంలో వ్యాఖ్యానించారు.
 
రాజధానిపై ప్రభుత్వం సమీక్ష జరుపుతోందని, త్వరలోనే కీలక ప్రకటన ఉంటుందని అప్పట్లో మంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే... ఈ వ్యాఖ్యలన్నీ సీఎం జగన్ పరోక్షంగా చేయిస్తున్నవేనని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

రాజధాని అమరావతిలో నిర్మించడం జగన్‌కు ఇష్టం లేదని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేయిస్తూ ప్రజలకు రాజధాని మార్పుపై సంకేతాలిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు