వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ కాకినాడ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అలాగే, ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో సహా మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
ఈ నెల 2వ తేదీన నగర పాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మి నగర్‌లో వైకాపా నేత సూరిబాబుకు చెందిన అక్రమ కట్టండ కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో వచ్చి గొడవకుదిగారని, రెచ్చగొట్టేలా వ్యవహరించారని పేర్కొన్నారు.
ద్వారంపూడి ప్రోద్బలంతో వైకాపా కార్యకర్తలు మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు. దీంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏ1గా, సూరిబాబును ఏ2గా, మరో 24 మందిపై కాకినాడ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.