ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అలాగే, తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ డి.నాగార్జునను కూడా మద్రాస్ హైకోర్టుకే కేంద్ర న్యాయశాఖ బదిలీ చేయగా, ఈ బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అయితే, సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ సిఫారసు చేసిన నాలుగు నెలలకు కేంద్రం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.
ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం గతేడాది నవంబర్ 24న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. ర్యాలీలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే బదిలీలు జరిగాయని ఆరోపించారు. భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఏపీ అడ్వొకేట్స్ ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి పలు తీర్మానాలు చేశారు. న్యాయమూర్తుల బదిలీలను పునఃసమీక్షించాలని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రను కలిసి వినతిపత్రం ఇచ్చారు.