రెడ్ జోన్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు

సోమవారం, 15 ఆగస్టు 2022 (08:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. రాష్ట్రానికి చెందిన విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కంలు)ను రెడ్ కేటగిరీలో చేర్చింది. వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు చెల్లించాల్సిన రూ.11,149 కోట్లను దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంచడమే దీనికి కారణం. 
 
ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు జరిపే చెల్లింపుల ఆధారంగా ఆయా రాష్ట్రాల డిస్కింల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పేమెంట్ ర్యాటిఫికేషన్ అండ్ ఎనాలసిస్ ఇన్ పవర్ ప్రొక్యూర్‌మెంట్ ఫర్ బ్రింగింగ్ ట్రాన్స్‌పరెన్స్ ఇన్ ఇన్వాయిసింగ్ ఆఫ్ జనరేటర్స్ (ప్రాప్తి) సంస్థ అంచనా వేస్తుంది. ఆయా రాష్ట్రాలు చెల్లించాల్సిన బకాయిలు, చెల్లింపు కాలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ కేటగిరీలను కేటాయిస్తుంది. 
 
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాప్తికి రూ.11,149 కోట్లను చెల్లించాల్సివుంది. ఈ యేడాది జూలై నాటికి దేశంలో అత్యధిక బకాయిలు ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి. సాధారణంగా ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు అయ్యే మొత్తాన్ని 45 రోజుల్లో డిస్సంలకు చెల్లించాల్సివుంది. 
 
అలా చెల్లించక పోవడంతో వాటికి బకాయిలు పెరిగిపోయాయి. వీటిలో 180 రోజులకు మించి ఉన్న బకాయిలు సుమారు రూ.3500 కోట్లు వరకు ఉన్నాయి. బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం డిస్కంల రేటింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఆ ప్రకారంగానే ఏపీని రెడ్ కేటగిరీలో చేర్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు