పోలవరంపై అంచనాలపై సీఎం జగన్ మెమొరాండం ఇవ్వలేదు : కేంద్రం స్పష్టీకరణ

సోమవారం, 8 మార్చి 2021 (14:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం తన వ్యక్తిగత అజెండా కోసమే అధికారం చెలాయిస్తున్నారన్న విషయం మరోమారు బహిర్గతమైంది. పలు ఆర్థిక నేరాల కేసుల్లో అడ్డంగా చిక్కుకునివున్న జగన్... ఆ కేసుల మాఫీ కోసం కేంద్రానికి లొంగిపోయారన్న ప్రచారం సాగుతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టుపెట్టారంటూ విపక్ష పార్టీల నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇపుడు సీఎం జగన్ పచ్చిగా అబద్ధాలు మాట్లాడినట్టు పార్లమెంట్ సాక్షిగా బహిర్గతమైంది.
 
జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం అంచనాలపై కేంద్రమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి మాట్లాడలేదని తేలిపోయింది. జనవరి 19న అమిత్ షాను కలిసినప్పుడు పెరిగిన పోలవరం అంచనాలను ఆమోదించాలని కోరినట్లు ఏపీ సర్కారు అధికారికంగా ఒక పత్రిక ప్రకటనను విడుదలచ చేసింది. అయితే అలాంటి మెమొరాండం హోంశాఖకు ఇవ్వలేదని పార్లమెంట్‌లో జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్ లాల్ తెలిపారు.
 
సీఎం జగన్ ఢిల్లీకి వచ్చి పెద్దలను కలిసి లోపల ఏం మాట్లాడుతున్నారు.. బయటకొచ్చి ఏం చెబుతున్నారో అన్నది ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా మరోసారి బయటపడింది. జగన్ కేంద్రానికి ఇచ్చిన మెమొరాండాలను ఎప్పుడు పత్రికలకు విడుదల చేయరు. కానీ సీఎంవో, ఇతర వ్యక్తుల నుంచి మాత్రం ప్రకటనలు వస్తాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పెద్దలను కలిసి మాట్లాడారని ప్రకటనలు ఇస్తారు. ఈ విషయంలో అనేకసార్లు అనేక సందేహాలు వచ్చాయి. 
 
సీఎం జగన్ జనవరి 19వ తేదీన, ఫిబ్రవరి 19వ తేదీన అమిత్‌ షాను కలిశారని, పోలవరంకు సంబంధించి పెరిగిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని సోమవారం పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కోరారు. దీనికి సమాధానంగా జలశక్తి సహాయం మంత్రి రతన్ లాల్ మాట్లాడుతూ అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని, అస్సలు మెమొరాండం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని ఆయన స్పష్టంచేశారు. దీంతో బండారం మరోమారు బయటపడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు