ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే.. వైసీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు విమర్శించారు. ఏ1, ఏ2 ఆర్థిక నేరస్తులు కూడా ప్రధానిని కలుస్తున్నారని సెటైర్లు విసిరారు.
రాష్ట్ర ప్రయోజనాలను సాధించే క్రమంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తనకు ఎలాంటి లాలూచీలు లేవని.. ఎలాంటి భయం కూడా లేదని చంద్రబాబు అన్నారు. విభజన చట్టం, ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే తాను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
సీమాంధ్రకు వచ్చే రెవెన్యూ లోటును తప్పకుండా భర్తీ చేయాలని రాజ్యసభలో ఆనాడు ప్రతిపక్ష నేతగా వ్యాఖ్యానించిన జైట్లీ.. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రిగా మారిన తర్వాత మాట మార్చారని గుర్తు చేశారు. ఆదాయ లోటు రూ.16,072 కోట్లుగా కాగ్ తేల్చిందని, రెవెన్యూలోటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా లెక్కలేస్తోందని చంద్రబాబు తెలిపారు.