విజయవాడ: ఒక దొంగ నన్ను ఇష్టానుసారం మాట్లాడుతుంటే, 5 కోట్ల మంది ప్రజల కోసం పడుతున్నా అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ, జగన్‌ని పరోక్షంగా దుయ్యబట్టారు. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎప్పుడూ దిగజారి మాట్లాడలేదు. కాపుల కోసం తొలిసారిగా కాపు కార్పొరేషన్ పెట్టి, రుణాలు ఇస్తుంటే, కాపు సమ్మేళనం అని తునిలో పెట్టి రైలు తగులబెట్టారు. ఇలాంటి చెడు వ్యక్తులకు దూరంగా ఉండి, మంచిని ప్రోత్సహిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని చెప్పుతో కొట్టమంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని సీఎం ప్రశ్నించారు. రౌడీ రాజకీయాలకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాను భయపడనని బాబు చెప్పారు. అనంతపురం టీడీపీ కంచుకోట అని, మూడు రోజులు కాదు, పది రోజులు తిరిగినా పంచాయతీ సర్పంచి కూడా రాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి ఎన్ని ఎంక్వైరీలు వేసినా నిప్పులా బయటకు వచ్చానని, ఇలాంటి రౌడీలు, నేరస్థులు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే పెట్టుబడులు పెట్టేవారు భయపడుతున్నారని అన్నారు. జగన్ వంటి వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని సీఎం చెప్పారు.