ఏం సింఘాల్ తెలుగు నేర్చుకున్నారా... ఎవరు?: పవన్ ప్రశ్నలకు నో ఆన్సర్

శనివారం, 20 మే 2017 (21:01 IST)
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌కు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మూడురోజుల పాటు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ప్రోటోకాల్ ప్రకారం టిటిడి ఈఓతో పాటు పలువురు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. టిటిడి ఈఓను చూసిన చంద్రబాబు ఏమయ్యా... సింఘాల్ తెలుగు నేర్చుకున్నారా అంటూ తమాషాగా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు.
 
నీకు ఇక్కడ ఎలా ఉందంటూ ఈఓను ప్రశ్నించారు బాబు. సర్.. ఇక్కడ బాగుందంటూ ఈఓ చంద్రబాబుకు సమాధానమిచ్చారు. ఆ తరువాత ఈఓ భుజం తడుతూ వచ్చేశారు బాబు. టిటిడి ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించినప్పటి నుంచి ఇప్పటివరకు తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. స్వాముల నుంచి, సినీప్రముఖుల వరకు అందరూ ఈఓ నియామకంపై విమర్శలు చేసిన వారే. 
 
ఉత్తరాదికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి టిటిడి లాంటి ప్రముఖ ధార్మిక సంస్ధకు ఈఓగా నియమించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చంద్రబాబునాయుడు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇదే విషయంపై ఏకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించారు. ఉత్తరాదికి చెందిన వ్యక్తిని ఏ విధంగా టిటిడి ఈఓగా నియమిస్తారని బాబు సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు పవన్. అయితే చంద్రబాబు మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానం ఇప్పటివరకు చెప్పనేలేదు.

వెబ్దునియా పై చదవండి