కోతి మూకలు అధికారంలోకి వస్తే రాష్ట్ర కుక్కలు చింపిన విస్తరే... బాబు

శనివారం, 23 జూన్ 2018 (22:02 IST)
అలవికాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కృతజ్జ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలోని ప్రజావేదికకు పెద్దసంఖ్యలో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును అంగన్వాడీ టీచర్లు కలిసారు. మంత్రి పరిటాల సునీత, మహిళా శిశిసంక్షేమ శాఖ అధికార్లు, మహిళా నేత రాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఒక పార్టీ వరుస ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని సీఎం చంద్రబాబు  పేర్కొన్నారు.
 
"రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం ఉన్న సంతృప్తి 90 శాతానికి పెంచాలన్నదే లక్ష్యం. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి మీ అందరూ అండగా నిలిస్తే  ప్రతిపక్షం అనేది ఉండద"న్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే 25 ఎంపీ సీట్లు సాధిస్తుంది. అప్పుడు ప్రధానిని మనమే నిర్ణయిస్తాం. ఫలితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు లభిస్తాయి. కేంద్రం నుంచి విభజన హామీలను దబాయించి సాధించవచ్చు. దాంతో ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు అధికం అవుతాయి.  చంద్రన్న ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గ్రామాల్లో చాటాలని అంగన్వాడీ టీచర్లకు సీఎం చంద్రబాబు చెప్పారు.
 
కేంద్రం వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. కేంద్రం జీఎస్టీ అమలు, నోట్ల రద్దు చేయడం వలన దేశప్రజలందరికీ కష్టాలు వచ్చాయన్నారు. నాలుగేళ్ళలో కేంద్రం సహకరించకపోయినా అంగనవాడీ టీచర్ల, ఆయాల బాధలను తొలగించేందుకు జీతాలు రూ. 10500, రూ.6000కు పెంచామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పేదవాళ్ళకు అండగా ఉండాలనే లక్ష్యంతో అంగన్వాడీ, ఆయాల వేతనాలు పెంచామన్నారు. అంగన్వాడీలు ఆనందంగా ఉంటే వారు పెంచే పేద పిల్లలు ఆరోగ్యంతో ఎదుగుతారన్నారు. తద్వారా వారి తల్లిదండ్రులు చివరకు సమాజం సంతోషంగా ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
 
నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్ల జీతాలను రూ.4200 నుంచి 7000, ఇప్పుడు రూ.10500కు పెంచాం. ఆయాలకు కూడా గతంలో ఉన్న రూ. 2500, రూ.4500 ఇప్పుడు రూ. 6000కు పెంచాం. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ.305 కోట్ల భారం పడుతుంది. అంగన్వాడీ టీచర్ల ఆనందంగా ఉండటమే లక్ష్యంగా సాహసోపేతమైన జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నాం. జీతాల పెంపుతో అంగన్వాడీ టీచర్లలో ఆనందం, ఉత్సాహం కనపడటం సంతోషకరం అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు