నేడు రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు - ఢిల్లీకి చేరుకున్న నేతలు

సోమవారం, 25 అక్టోబరు 2021 (09:13 IST)
అమరావతిలోని మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, నాయకుల ఇళ్లపై దాడులను రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం, ఇతర పార్టీ నేతల దృష్టికి తెచ్చేందుకు చంద్రబాబు సమాయత్తమయ్యారు. సోమవారం ఉదయం బయల్దేరి టీడీ జనార్థన్‌, శ్రీనివాసరెడ్డి, బీసీ జనార్థన్‌రెడ్డి తదితరులతో కలసి ఆయన ఢిల్లీ వెళ్లారు. 
 
ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, షరీఫ్‌, పయ్యావుల కేశవ్‌, వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. 
 
మరోవైపు పార్టీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌ అక్కడే ఉండి సమన్వయం చేస్తున్నారు. తొలుత మధ్యాహ్నం 12.30కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను చంద్రబాబు కలుస్తారు. 
 
దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడిచేసిన వైనాన్ని వివరించనున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల సమయం కూడా చంద్రబాబు కోరారు. 
 
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేయనున్నారు. అదేసమయంలో పార్లమెంటులో ఉన్న పలువురు పార్టీ నేతలను కూడా కలిసే అవకాశాలున్నాయి. 
 
ఈ సందర్భంగా గంజాయి, డ్రగ్స్‌కు రాష్ట్రం కేంద్రంగా మారిన విషయాన్ని విపులంగా ప్రస్తావించనున్నారు. దీనిని మాట్లాడినందుకే తమ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందన్న విషయాన్ని వారి దృష్టికి ప్రభవశీలకంగా తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు