2019లో ఏపికి మళ్లీ చంద్రబాబే సీఎం... చెప్పింది కేసీఆర్ జ్యోతిష్యుడు...

బుధవారం, 12 డిశెంబరు 2018 (15:00 IST)
తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి ఘోర పరాజయం పాలవడంతో ఆ ప్రభావం ఏపీ పైన పడుతుందనీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిపైన వుంటుందనే చర్చ నడుస్తోంది. కానీ అదేమీ నిజం కాదంటున్నారు ఎంజీకె జ్యోతిష్యులు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పింది తనేననీ, ఇది నిజమైందని అంటున్నారాయన. కేసీఆర్ లక్కీ నెంబర్ ప్రకారం ఆయనకు అదృష్టం వరించిందని చెప్పుకొచ్చారు.
 
ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘన విజయం సాధిస్తుందనీ, మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం పగ్గాలు చేపడుతారని ఆయన జాతక బలాన్ని బట్టి తెలుస్తోందన్నారు. జగన్ మోహన్ రెడ్డి విషయానికి వస్తే... ఆయనకు ఏ పార్టీ బలం లేదనీ, భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన.. ఇలా అన్ని పార్టీలలో ఏ ఒక్క పార్టీతోనూ సంబంధం లేదు కనుక ఆయన 2019 ఎన్నికల్లో కష్టపడినా ఫలితం దక్కదని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కల్యాణ్ ప్రభావంపైన ఆయన స్పందించలేదు. 
 
ఏపీలో కాస్తో కూస్తో వున్న భాజపా ఊడిచిపెట్టుకుపోతుందన్నారు. ప్రత్యేక హోదా అనేది భాజపాకు శాపంగా మారుతోందనీ, ఇదే ఆ పార్టీని అక్కడ అధఃపాతాళానికి తీసుకెళ్తుందని అన్నారు. ఏపీ ప్రజలు మోదీ మీద కసి తీర్చుకునేందుకు సిద్ధంగా వున్నారని చెప్పుకొచ్చారు. మరి కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని చెప్పిన ఈ జ్యోతిష్యుల మాటలు చంద్రబాబు విషయంలో నిజమవుతాయా? చూడాలంటే మరో 6 నెలలు ఆగాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు