రేవంత్ రెడ్డి ఓటమి... వెల్డన్ కేసీఆర్.. చంద్రబాబు అభినందనలు

మంగళవారం, 11 డిశెంబరు 2018 (16:00 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయభేరీ మోగించిన తెరాస అధినేత కేసీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. మంగళవారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచీ భారీ ఆధిక్యత దిశగా కారు దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ ఘన విజయం ఖాయమైపోయింది. 
 
ఇప్పటివరకు తెరాస 42 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 46 స్థానాల్లో ముందంజలో తెరాస కొనసాగుతోంది. మరోవైపు, గజ్వేల్‌లో కేసీఆర్‌ 50 వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, కర్ణాటక సీఎం కుమార స్వామితో పాటు వైకాపా అదినేత వైఎస్‌ జగన్‌ ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు.
 
ఇకపోతే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొండగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఓడిపోయారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి చేతిలో 10772 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొడంగల్‌లో తెరాస గెలుపుకోసం ఆ పార్టీ ముఖ్యనేతలే రంగంలోకి దిగారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితర ముఖ్యనేతలంతా కొడంగల్‌లో మకాం వేసి రేవంత్ రెడ్డి ఓటమికి తీవ్రంగా శ్రమించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు