ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని, ఈ జిల్లాల ఏర్పాటుపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సరిదిద్దుతామని ఆయన వెల్లడించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై పార్టీ నేతలతో ఆయన సోమవారం చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రం మరో శ్రీలంకలా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలే ఈ రాష్ట్ర పరిస్థితికి నిదర్శనమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు కూడా అశాస్త్రీయంగా ఉందన్నారు. ఈ జిల్లాల ఏర్పాటు రాజకీయ కోణంలో తీసుకున్న అంశమని పేర్కొన్నారు.
రాజధాని అమరావతిలో 80 శాతం మేరకు జరిగిన పనులను కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శలు చేశారు. జగన పాలనపై ఆయన సొంత సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదని అన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం పదవులు ఇస్తున్నారని, జగన్‌కు ఓటేసి తప్పు చేశామన్న భావన ఇపుడు సొంత నియోజకవర్గంలోనే కనిస్తుందన్నారు. ఇకపోతే సీపీఎస్ అంశంలో ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని చంద్రబాబు తెలిపారు.