ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఠాగూర్

శుక్రవారం, 29 నవంబరు 2024 (14:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అందజేసే సామాజిక పింఛన్లను ఈ దఫా ఒక నెల ముందుగానే అందజేయనుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని ఈ పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఆయన జిల్లా పర్యటన ఖరారైంది. 
 
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయడంతో పాటు నేమకల్లు గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై అర్జీలు స్వీకరించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో ఖరారు చేసింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఇలా సాగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి 11.40 గంటలకు చేరుకుంటారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి 12.45 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టరులో రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలం నేమకల్లు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.45 నుంచి 12.50 వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.
 
12.50 నుంచి 1.20 గంటల వరకూ విశ్రాంతి తీసుకుంటారు. 1.20 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 1.25 గంటలకు నేమకల్లు ఇందిరమ్మ కాలనీకి చేరుకుంటారు. 1.25 గంటల నుంచి 1.55 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. 1.55 గంటల నుంచి 2.00 గంటల వరకు నేమకల్లులోని ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. 
 
ఆ తర్వాత 3.05 వరకు గ్రామస్తులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.10 గంటలకు నేమకల్లు హెలిప్యాడ్ చేరుకొని 3.15 వరకూ అర్జీలు స్వీకరిస్తారు. 3.45 గంటలకు హెలీకాప్టరులో బెంగళూరుకు బయలుదేరి అక్కడ నుంచి గన్నవరం లేదా హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు