భర్తతో గొడవపడి ఐదుగురు కుమార్తెలతో కలిసి మహిళ ఆత్మహత్య

శుక్రవారం, 11 జూన్ 2021 (08:15 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కట్టుకున్న భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఓ మహిళ తన ఐదుగురు కుమార్తెలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఛత్తీస్‌గఢ్ జిల్లా మహాసముంద్ జిల్లా బెమ్చా గ్రామానికి చెందిన ఉమా సాహు (45) రామ్ సాహు భార్యాభర్తలు. వీరికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా 18-10 ఏళ్లలోపు వారే. బుధవారం కుటుంబ గొడవల కారణంగా భర్తతో ఉమకు గొడవ జరిగింది.
 
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అదే రోజు రాత్రి గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న బేల్ సొండా రైల్వే జంక్షన్‌‌కు వెళ్లింది. వేగంగా వస్తున్న రైలు కింద పిల్లలతో కలిసి దూకింది. ఈ ఘటనలో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను నిన్న ఉదయం గమనించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ విచారణకు ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు