తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిగురుపాటి హత్య కేసులో రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. ఈ హత్యలో శిఖా చౌదరి ప్రమేయం వుందని టాక్ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ కేసులో శిఖా చౌదరి ప్రమేయం లేదని ఏపీ పోలీసులు వెల్లడించారో.. ఆ వెంటనే చిగురుపాటి జయరామ్ సతీమణి పద్మశ్రీ మాట మార్చింది. మొన్నటివరకు ఈ కేసులో ఎవరిపైనా అనుమానాలు లేవని చెప్పిన పద్మశ్రీ, ప్రస్తుతం శిఖా చౌదరిపై అనుమానం వ్యక్తం చేసింది.
ఇలా తన భర్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఆయన భార్య పద్మశ్రీ మీడియా ముందు రెండు రకాలుగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భర్త హత్య విషయం తెలుసుకున్న అనంతరం విదేశాల నుంచి వచ్చిన ఆమె, మొన్న తన భర్త మరణంపై తనకు ఎవరిపైనా అనుమానాలు లేవని ముందు చెప్పింది.
పద్మశ్రీ ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పే సమయానికే జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి, రాకేశ్ రెడ్డిలు నందిగామ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసును పోలీసులు విచారించి, నిందితులను బయటకు లాక్కొస్తారన్న నమ్మకం తనకుందని కూడా రెండు రోజుల క్రితం పద్మశ్రీ వ్యాఖ్యానించారు.
ఎప్పుడైతే ఈ కేసులో శిఖా ప్రమేయం లేదని ఏపీ పోలీసులు వెల్లడించారో, ఆ వెంటనే ఆమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త హత్య హైదరాబాద్‌లో జరిగిందని గుర్తు చేస్తూ, ఏపీ పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తన భర్త సొంత సోదరి నుంచే ప్రాణహాని ఉందని తనకు చెప్పేవారని, ఈ కేసులో అసలు నిందితులను ఏపీ పోలీసులు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.