వాట్సాప్ ద్వారా పనికిరాని మెసేజ్‌లు పంపొద్దని చాలామంది చెబుతుంటారు. కొంతమందికి వాట్సాప్ ఉపయోగకరంగా ఉంటే మరికొంతమందికి వాట్సాప్ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతోంది. కానీ కొంతమంది మాత్రం వాట్సాప్‌ను సమాజానికి ఉపయోగపడే విధంగా వాడుతున్నారు. అలాంటి వారి కారణంగా తిరుమలలో కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. సురక్షితంగా చిన్నారిని పట్టుకోగలిగారు పోలీసులు.
తిరుమలలో రెండు రోజుల క్రితం కిడ్నాపైన మహారాష్ట్ర లాథోర్‌కు చెందిన సంవత్సరం నాలుగు నెలల చిన్నారి వీరేష్ కిడ్నాప్ కథ సుఖాంతమయింది. వాట్సాప్‌ల ద్వారా ప్రజలు వీరేష్ ఫోటోను, కిడ్నాపర్ ఫోటోను షేర్ చేశారు. దీంతో తిరుమలలో కిడ్నాపైన చిన్నారి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా దక్షిణాది రాష్ట్రాలలోని ప్రజలకు చేరింది.
కేవలం 48 గంటల్లోనే మహారాష్ట్రలోని మాహోర్ పోలీసులు కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు కిడ్నాపర్‌ను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వాట్సాప్ ద్వారానే నిందితుడిని, చిన్నారిని స్థానికులు గుర్తించారట. వాట్సాప్ ఒక చిన్నారిని సురక్షితంగానే తల్లిదండ్రులకు చేరుస్తోందంటూ ప్రతి ఒక్కరు మంచి పనికే వాట్సాప్‌ను వాడాల్సిన అవసరం ఉంటుంది.