సినిమా టిక్కెట్ల వివాదం ఆంధ్రప్రదేశ్ లో రాజుకుంటుండగా, ఇపుడు తెలంగాణాలోనూ దాని ప్రభావం పడింది. సినిమా టిక్కెట్ల ధరలను పెద్ద సినిమాల పేర్లు చెప్పి ఇష్టానుసారం పెంచే వీలులేదని ఏపీ ప్రభుత్వం ఖరాఖండితంగా చెప్పింది. జీవో నెంబరు 35ను తెచ్చి, టిక్కెట్ల ధరలను తగ్గించేసింది. దీనిపై సినీ హీరోల కామెంట్లు, వైసీపీ నేతల ప్రతి విమర్శలతో హీటెక్కిపోయింది. ఇక ఇక్కడి ప్రభుత్వం దిగిరాలేదని తెలంగాణాలో సినీ వర్గాలు పావులు కదిపాయి.
తెలంగాణాలో పెద్ద సినిమాలకు ఇష్టానుసారం టిక్కెట్ల ధరలు పెంచుకోవచ్చని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీనితో సినీ అభిమానులను దోచుకునేందుకు ఆర్.ఆర్.ఆర్. సినిమా పేరు చెప్పి, ముందస్తుగా, తెలంగాణలో భారీ దోపిడీకి సినీ ప్రముఖులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆంధ్రా లో తమకి జరిగిన నష్టాన్ని తెలంగాణలో పూర్తి చేసేందుకు, ఏకంగా ప్రేక్షకులను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు. మల్టీప్లెక్స్ లో రూ. 150 నుంచి 200 కు పెంచిన టిక్కెట్ ధరలను ... ఇపుడు ఆర్.ఆర్.ఆర్. వంటి పెద్ద సినిమాలు కోసమని అమాంతం రూ. 295కి ధరలు పెంచేశారు. ఇది కచ్చితంగా దిగువ, మధ్య తరగతి ఫ్యామిలీలకు చిన్న సినిమాలను దూరం చెయ్యడమేనని ప్రేక్షకులు మండిపడుతున్నారు.