డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను త‌క్ష‌ణం శుభ్ర‌ప‌ర్చండి: ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

సోమవారం, 15 నవంబరు 2021 (22:18 IST)
విజయవాడ నుంచి విశాఖపట్నానికి వెళ్లే జాతీయ రహదారికి ఇరుప్రక్కలా డ్రైనేజ్ కాలువ
నుండి దుర్వాసన వెదజల్లుతున్నందున ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆటోనగర్ నుంచి పరిశ్రమలు వదిలిన వ్యర్థాలతో కలిపి పారుతున్న కాలువ ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారి ప్రయాణికులకు కాలువ నుండి వచ్చే దుర్వాసన దుర్లభంగా మారింది. ఈ విషయం దృష్టికి వచ్చిన వెంటనే సిఎంఓ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో కలసి పరిశీలించారు.

కాల్వ‌లో దుర్గంధం వస్తుందని ఆయన గుర్తించారు. ఆ డ్రైనేజీ వ్యవస్థను తక్షణం శుభ్రపరచమని ఏఎంఆర్‌ఎ కమిషనర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కాలువ పారిన తరువాత జాతీయ రహదారికి పైన ఉన్న కల్వర్ట్ కు ఇరుప్రక్కల ఇనుప జల్లెడను ఏర్పాటు చేయమని ఆదేశించారు. అనంతరం కాలువ దుర్గంధం ఎక్కడ కలుస్తుందో చూడాలని ఆటోనగర్ వరకు కాలువ ను పరిశీలించారు.

పంట కాలువ నీరు కూడా కలస్తుందని గుర్తించారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలు వేయించి కాలువ మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. జాతీయ రహదారి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కాలువ ఓపెన్‌గా ఉందని దానిని తక్షణం పైకప్పుతో మూసివేయమని కూడా ఆదేశించారు.

కాలువ మరమ్మతు పనులు పూర్తి చేసిన తరువాత దాని నిర్వహణ బాధ్యతను నగర మున్సిపల్ కమిషనర్‌కు అప్పగించాలని ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ సెక్రటరీ జిఎస్ఆర్ కెఆర్ విజయకుమార్, విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, స్వచ్ఛభారత్ డి.డా.పి.సంపత్‌కుమార్ జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ శివశంకర్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు