ఝంజావతిపై సీఎం వేసిన తొలి అడుగు చారిత్రాత్మకం: ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి

బుధవారం, 10 నవంబరు 2021 (18:53 IST)
ఝంజావతి ప్రాజెక్ట్ కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వేసిన తొలి అడుగు చారిత్రాత్మకమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. అరవై ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడానికి సీఎం చారిత్రాత్మకమైన ప్రయత్నం చేసారని పేర్కొన్నారు.
 
ఝంజావతీ కాంక్రీట్ డ్యాం నిర్మాణం విషయంలో ఒడిస్సా రాష్ట్రం నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిస్సా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో చర్చలు జరిపిన నేపథ్యంలో బుధవారం మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి సీఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణవతో తన సొంత నియోజకవర్గమైన కురుపాంతో పాటుగా పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన రైతులకు కూడా ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. జంఝావతిలో 75 శాతం లభ్యత ఆధారంగా 8 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసి వాటిలో ఒడిశా, ఏపీలు చెరి సగం వాడుకునేలా 1978, డిసెంబర్‌ 25న రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని గుర్తు చేసారు.

ఈ ఒప్పందంలో భాగంగా దక్కిన 4 టీఎంసీలను వాడుకుని విజయనగరం జిల్లాలో కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని 75 గ్రామాల్లో 24,640 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా జంఝావతి ప్రాజెక్టును దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో జలయఙ్ఞంలో భాగంగా చేపట్టారని తెలిపారు.

3.40 టీఎంసీల సామర్థ్యంతో విజయనగరం జిల్లాలో కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతిపై ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టగా, ఈ ప్రాజెక్టులో ఒడిశాలోని 1,175 ఎకరాల భూమి ముంపునకు గురవుతంది. ఈ భూమిని సేకరించి ఇవ్వాలని.. పరిహారం చెల్లిస్తామని అప్పట్లో ఒడిశా సర్కార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరినా ఒడిశా నిరాకరించిందని చెప్పారు.

జంఝావతి ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా అందించడానికి కాంక్రీట్‌ డ్యామ్‌ స్థానంలో రబ్బర్‌ డ్యామ్‌ను నిర్మించి.. 2006, జనవరి 1న నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జాతికి అంకితం చేశారని, దీని ద్వారా అప్పట్లోనే తొమ్మిది వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారని వివరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఝంజావతి ప్రాజెక్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోకపోగా మళ్లీ ఇంత కాలానికి వైయస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి  చొరవ తీసుకున్నారని కితాబిచ్చారు.

ఝంజావతి ప్రాజెక్టు లో ముంపునకు గురయ్యే భూమిని సేకరించి ఇవ్వడానికి ఒడిశా సర్కార్‌ను ఒప్పించడం ద్వారా రబ్బర్‌ డ్యామ్‌ స్థానంలో శాశ్వతమైన కాంక్రీట్‌ డ్యామ్‌ను నిర్మించి విజయనగరం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారని ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసిన తొలి అడుగు చారిత్రాత్మకమైనదని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం పట్ల రైతులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఝంజావతి రైతుల సమస్యను పరిష్కరించడానికి సీఎం చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఝంజావతి ప్రాజెక్టుతో పాటుగా  ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులోని కొఠియా గ్రామాల సమస్యను కూడా పరిష్కరించడానికి సీఎం ప్రయత్నించడం హర్షణీయం అని చెప్పారు.

సీఎం చేసిన ఈ ప్రయత్నం తో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని ఝంజావతి ప్రాజెక్ట్, కొఠియా గ్రామాల సమస్యలు పరిష్కారం అవుతాయని పుష్ప శ్రీవాణి ఆశాభావం వ్యక్తంచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు