సీఎం జగన్ తేనేటి విందు...తెలుగువాడిని అనే మర్యాదతోనే...
గురువారం, 19 ఆగస్టు 2021 (17:19 IST)
సిఎం జగన్ తనను మర్యాద పూర్వకంగానే ఆహ్వానించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలుగు వాడికి కేంద్రమంత్రిగా అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారని చెప్పారు.
జన ఆశీర్వాద యాత్రకు విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్నారు. కిషన్ రెడ్డికి ఎపి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. దుర్గమ్మ ను దర్శించుకొన్న కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాంతరం అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు తీర్ద ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. కిషన్ రెడ్డి తో పాటు దుర్గమ్మను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు, సిఎం రమేష్, మాధవ్ దర్శించుకున్నారు.
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు. నిన్న తిరు వెంకన్న స్వామిని, ఇవాళ దుర్గమ్మను దర్శించుకున్నా... చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించాలని మోడీ అకాంక్షించారని, అందుకే వరంగల్ లోని వీరబద్ర దేవాలయాన్ని యునెస్కొ హెరిటేజ్ సెంటర్ గా గుర్తించిందన్నారు.
రానున్న రోజుల్లో ఎపిలో ఉన్న126 టెంపుల్ టూరిజం కేంద్రాలను, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సిఎస్అర్ ఫండ్ కింద అభివృద్ధి చేస్తామన్నారు. దుర్మమ్మ ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు.
టూరిజం డిపార్ట్మెంట్ చాలా ఛాలెంజ్ తో కూడింది. గత రెండేళ్లుగా కోవిడ్ తో టూరిజం బాగా దెబ్బతింది. జనవరి 1 నాటికి కోవిడ్ తగ్గగానే టూరిజాన్ని మరింత డవలప్ చేస్తాం అని చెప్పారు. భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను అందరికీ తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. పర్యటక శాఖ ద్వారా నా వంతు సహకారం తెలుగు రాష్ట్రాలకు తెలుగువాడిగా అందిస్తా... ఏపి, తెలంగాణా మోడీకి రెండు కళ్లులాంటివి అని చెప్పారు.