తాలిబన్లు అఫ్గనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత సమాజ్‌వాదీ పార్టీ నేత, సంబల్ ఎంపీ షఫీఖర్ రహమాన్ బర్క్ వారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అఫ్గన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. భారతీయుల పోరాటం, తాలిబన్ల ఉద్యమం దాదాపు సమానమేనని.. వారిది ఒకరకంగా స్వాతంత్య్ర పోరాటమేనని ఆయన అభివర్ణించారు.
షఫీఖర్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. తాలిబన్లను సమర్థించడం అంటే వారి రాక్షసకాండను సైతం సమర్థించినట్లేనని అన్నారు. మానవత్వానికి మచ్చగా మారిన వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే అసలు మనం ఎక్కడి వెళ్తున్నామని? అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లల పట్ల క్రూరంగా వ్యవహరించే తాలిబన్లకు మద్దతిచ్చేలా కొందరు వ్యక్తులు మాట్లాడటం సిగ్గుచేటని యోగి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మూడో రోజు సభలో మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తాలిబన్లకు మద్దతిస్తున్నారు.. అక్కడ మహిళలు, పిల్లల పట్ల ఎలాంటి క్రూరత్వం జరుగుతోంది? కానీ, కొంతమంది సిగ్గులేకుండా తాలిబన్లకు మద్దతు ఇస్తున్నారు. అటువంటి వారిని బహిర్గతం చేయాలి అని వ్యాఖ్యానించారు.