జగన్‌పై అక్కసు వెళ్లగక్కిన మరో వైకాపా ఎమ్మెల్యే... పార్టీని వీడేందుకే మొగ్గు...

ఠాగూర్

మంగళవారం, 9 జనవరి 2024 (09:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ వైకాపాలో సీట్ల చిచ్చురేపింది. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తలను నియమిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు వంద మందికి ఆయన టిక్కెట్లను నిరాకరిస్తున్నారు. అలాగే, పలువురు ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగాను, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులుగా మారుస్తున్నారు. మరికొందరు సిట్టింగ్‌లకు జగన్ మొండిచేయి చూపుతున్నారు. ఈ క్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా సీఎం జగన్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 
 
ఇటీవల వైకాపా సాధికార బస్సు యాత్రలో పార్థసారథి అందరి ముందు బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం తనకు ఎపుడూ మద్దతుగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. పైగా, ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో గత వారం రోజులు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్.. జగన్ సూచనతో పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగానే నిన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, అనిల్ కలిసి పార్థసారథిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. అయితే, జగన్‌తో దాదాపు 20 నిమిషాల చర్చ తర్వాత కూడా పార్థసారథి అసంతృప్తిగానే ఉన్నారని పార్టీ వీడాలనే నిర్ణయానికి ఆయన కట్టుబడివున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు