17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై సీఎం దృష్టి సారించాలి: నారా లోకేష్ లేఖ
మంగళవారం, 6 జులై 2021 (18:35 IST)
రాష్ట్రంలో విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరగుతున్న నేపథ్యంలో పరీక్షలు రాయనున్న 17 లక్షల మంది విద్యార్థుల భద్రతకి పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరో లేఖ రాశారు.
విద్యార్థులకు జరగబోయే సెమిస్టర్ పరీక్షల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. అందరి డిమాండ్‌తో టెన్త్, ఇంటర్ విద్యార్థుల పరీక్షలు రద్దు నిర్ణయాన్ని తీసుకున్న ముఖ్యమంత్రిని అభినందించారు. పరీక్షలను రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువకి వచ్చిందన్నారు.
కోవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రజల సహకారంతో కలిసి పనిచేయటం ఎంతో ముఖ్యమని సూచించారు. రానున్న రోజుల్లో అనేక మంది విద్యార్థులు ఎదుర్కోనున్న పరీక్షల సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు పరీక్షా క్యాలెండర్లు విడుదల చేసినందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.
రాష్ట్రంలోని 53విశ్వవిద్యాలయాల పరిధిలో 3500కు పైగా ఉన్నత విద్యాసంస్థలతో పాటు వేలాది కళాశాలలు, ఇతర శిక్షణా కేంద్రాలు, దూరవిద్య కేంద్రాలు అన్నింటిలోనూ 17లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, సెమిస్టర్ పరీక్షలు వీరంతా రాయాల్సిన నేపథ్యంలో మళ్లీ కోవిడ్ ప్రబలే ప్రమాదం పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రమంతటా జరిగే పరీక్షల ప్రక్రియ వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, అధ్యాపకులకు ప్రాణాంతకమని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరీక్షల నిర్వహణ వల్ల కోవిడ్ వ్యాప్తి చెంది మూడో దశ వచ్చే ప్రమాదం పొంచి వుందన్నారు. రాష్ట్రంలో ఇంకా చాలా మంది విద్యార్థులు టీకా వేయించుకోని విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఉన్నత విద్యలో సెమిస్టర్, సంవత్సరాంత పరీక్షలు ఎంతో ముఖ్యమైనప్పటికీ లక్షల మందికి సామూహికంగా ఒకేసారి పరీక్షల నిర్వహణ చాలా ప్రమాదం అని, దీనికి ప్రత్యామ్నాయమార్గాన్ని ప్రభుత్వం అన్వేషించాలని కోరారు.
డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ వద్దంటూ కేరళ, కర్ణాటక, తెలంగాణలో విద్యార్థులు ఇప్పటికే నిరసనలు ప్రారంభించారని, ఆ పరిస్థితిలో ఏపీలో రాకుండా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో హాస్టల్స్, కళాశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అవడం ఆందోళన కలిగించే అంశమని, రాబోయే మూడో దశ ముప్పును ఎదుర్కొనేందుకు అంతా ముందుగానే సంసిద్ధం కావాల్సిన అత్యవసరం వుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి అందరి అభిప్రాయాలతో పరీక్షలు నిర్వహణపై సరైన నిర్ణయం తీసుకోవాలని నారా లోకేష్ లేఖలో కోరారు.