రోడ్లు పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలి: సీఎం జగన్
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (19:03 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ రోడ్లు, భవనాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదని సీఎం ఆరోపించారు. తర్వాత వర్షాలు బాగా పడటంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయని సీఎం అన్నారు.
తప్పంతా గత ప్రభుత్వం చేసి.. ఈ ప్రభుత్వ హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్లు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తుందని సీఎం విమర్శించారు.
సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో రహదారి భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్.
రోడ్ సేఫ్టీ పై లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రోడ్లు పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలి. దీని వల్ల చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయన్నారు.
బైక్‌లకు ప్రత్యేక లేన్, ఫోర్ వీల్ వాహనాలకు ప్రత్యేక లేన్స్ ఏర్పాటుపై ఆలోచన చేయాలని జగన్ చెప్పుకొచ్చారు. ట్రామాకేర్ సెంటర్లను కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని వెల్లడించారు.