నేడు ఒంగోలుకు సీఎం జగన్ - ఆర్టీవో అధికారుల ఓవరాక్షన్

శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (08:27 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఒంగోలులో పర్యటించనున్నారు. దీంతో ఒంగోలు పట్టణ వాసులకు పోలీసులు నరకం చూపిస్తున్నారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ పేరుతో రెండు రోజుల నుంచి పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో వాహనాలను గంటల కొద్దీ నిలిపివేస్తున్నారు. 
 
రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారికేడ్లు అమర్చి పరదాలు కట్టేశారు. మరోవైపు, ఆర్టీసీ అధికారులు మరింత అతి చేశారు. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆర్టీవో అధికారుల దుశ్చర్యతో రాత్రంతా బస్టాండులోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. సీఎం జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
వినుకొండ నుంచి తిరులకు అద్దె కారులో శ్రీనివాస రావు కుటుంబం బయలుదేరింది. టిఫిన్ చేసేందుకు ఒంగోలులోని అద్దంకి బస్టాండు దగ్గర ఆగారు. ఇదేసమయంలో అక్కడే ఉన్న రవాణా శాఖ అధికారులు సీఎం టూరుకు కార్లు కావాలంటూ బలవంతంగా ఆ కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే, తాము తిరుమలకు వెళుతున్నామని కారు ఇవ్వాలంటూ అధికారులను శ్రీనివాసరావు ఎంతగానో ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ అధికారులు ఏమాత్రం కనికరించలేదు. 
 
కారు ఇచ్చేది లేదని కావాలంటే బస్సులో వెళ్లాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో వారు చేసేది ఏమిలేక బస్టాండుకు చేరుకుని వినుకొండ నుంచి మరో అద్దె కారులో తిరుమలకు చేరుకున్నారు. అయితే, రవాణా శాఖ అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటనకు కార్లు కావాలంటే సొంతంగా సమకూర్చుకోవాలేగానీ, దూర ప్రాంతాలకు వెళ్లే కార్లు ఆధీనంలో తీసుకోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు