విశాఖకు కంటైనర్‌లో వచ్చింది డ్రగ్సే... నివేదికలో పేర్కొన్న సీబీఐ

వరుణ్

ఆదివారం, 24 మార్చి 2024 (17:36 IST)
బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్ వచ్చినట్టు సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ పేరుతో 25 బస్తాల్లో ఒక్కో బస్తాలో 25 కేజీల చొప్పున మొత్తం 25 వేల కేజీల డ్రగ్స్ వచ్చిందని పేర్కొంది. ఈ డ్రగ్స్‌లో ఓపియం, మార్ఫిన్, హెరాయిన్, యాంఫిటమిన్, మెస్కలిన్ ఉనికి తెలుసుకునేందుకు వీలుగా 27 రకాలైన టెస్ట్-ఏ పరీక్షలు నిర్వహించగా, అన్నింటిలోనూ మాదకద్రవ్యం ఉన్నట్టు తేలిందని సీబీఐ పేర్కొంది. ఈ కంటైనర్ సంధ్యా ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చినట్టు నిర్ధారించారు. ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ నుంచి 49 నమూనాల్ని పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్టు తేలింది. అంటే మొత్తం 25 వేల కిలోల ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌లోనూ డ్రగ్స్ ఉనికిని ఉన్నట్టు స్పష్టైమైందని  పేర్కొంది. అయితే, ఇందులో ఎంత పరిణామాలో ఉన్నాయన్నదే తేలాల్సివుందన్నారు. కనీసం 20 శాతం మేరకు డ్రగ్స్ కలగలిసి ఉంటాయని భావిస్తున్నారు. 
 
మరోవైపు, సీబీఐ అధికారులు ఆ ప్యాకెట్లను రీప్యాక్‌ చేసి వాటిని కంటెయినర్‌లో భద్రపరిచి సీల్‌ చేశారు. ఆ తర్వాత 20వ తేదీన ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి మళ్లీ పరీక్షలు ప్రారంభించగా, అన్ని నమూనాల్లోనూ డ్రగ్స్‌ మూలాలు బయటపడ్డాయి. సంధ్య ఆక్వా ప్రతినిధులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. బ్రెజిల్‌ నుంచి వచ్చిన సరకు మొత్తాన్నీ బయటకు తీసి వాటిని ఎన్‌వైకేయూ 0823944 నంబరు గల కంటెయినర్‌లోకి సీబీఐ మార్చింది. దానికి బ్రాస్‌ సీల్‌ వేసింది. ఆ తర్వాత సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మరికొందరు వ్యక్తులపై ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేసి, విచారణ జరుపుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు