కవితను కలిసిన సబితా ఇంద్రారెడ్డి.. త్వరలో తెరాస తీర్థం?

ఆదివారం, 10 మార్చి 2019 (14:36 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్తగలనుంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు అధికార తెరాసలో చేరిపోయారు. మరికొందరు చేరేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి అధికార తెరాసలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈ వార్తలను నిజం చేసేలా వారిద్దరూ ఆదివారం తెరాస ఎంపీ కల్వకుంట్ల కవితతో సమావేశమయయారు. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ వారిమధ్య సంధి కుదిర్చినట్లు సమాచారం. ఒవైసీ ఇంట్లోనే కవిత - సబిత భేటీ అయ్యారని, కార్తిక్‌ రెడ్డితో పాటు ప్రధాన అనుచరులంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన రాహుల్‌ గాంధీ బహిరంగ సభలో కూడా పార్టీ అధిష్టానంపై సబిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 
 
కాగా, ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీపై కార్తిక్‌ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు అధికార టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు మరింత పదునుపెట్టింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పార్టీని వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ కీలకంగా భావించే లోక్‌సభ ఎన్నికల ముందు ఇలా ముఖ్య నేతలంతా వీడుతుండటం పార్టీ నాయకత్వానికి తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. 
 
ఇప్పటికే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మరెంత మంది నేతలు పార్టీకి గుడ్‌బై చెప్తోరోనని పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. అలాగే టీ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఏ. రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ సభకు గైహాజరు కావడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు