కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా!

ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (12:13 IST)
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయపూర్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 85వ ప్లీనరీ సమావేశంలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. 
 
ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందన్నారు. విభజన చట్టంలోని హామీలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడివుందన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
 
అలాగే, 2018 నుంచి ఇప్పటివరకు మరణించిన కాంగ్రెస్ నేతలకు ప్లీనరీలో సంతాపం తెలుపుతూ తీర్మానం చేసారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, మర్రి నవీన్ బాబు, మజ్జి శారద, సబ్బం హరి, రెడ్డయ్య యాదవ్, బాల సుబ్బారావు, ఇటీవల మరణించిన వట్టి వసంతకుమార్‌ తదితరులకు సంతాపం తెలిపారు. అలాగే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్.జైపాల్ రెడ్డి, ఎం.భూపేశ్ గౌడ్‌లకు ప్లీనరీలో నేతలు సంతాపం తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు