రాష్ట్రంలో కొత్తగా మూడు స్టేడియాల నిర్మాణం.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

మంగళవారం, 16 జులై 2019 (08:12 IST)
రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణంలలో మూడు కొత్త అంతర్జాతీయ స్టేడియంల నిర్మాణం చేపడతామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 
 
రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను అన్ని విధాల ప్రోత్సహిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా క్రీడాకారులకు ఆర్థిక చేయూతని అందిస్తామని వెల్లడించారు. అదే విధంగా విద్యార్థుల్లో దేశభక్తి, సంప్రదాయ విలువల పట్ల గౌరవం పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ విషయమై జిల్లా స్థాయి స్పోర్ట్స్ అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. 
 
రాష్ట్రంలో కొత్తగా మూడు స్టేడియంల నిర్మాణం చేయడంలో భాగంగా ఈ ఏడాది రూ.150 కోట్లతో స్టేడియం నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. కడప, విజయనగరం జిల్లాల్లో క్రీడాపాఠశాలల ఏర్పాటు కోసం బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 150 కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మాణానికి సంకల్పించామన్నారు. విశాఖపట్టణం, విజయవాడ,తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాల నిర్మాణం కోసం డీపీఆర్ లను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు.  
 
ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించడం జరిగిందన్నారు. క్రీడల పట్ల విద్యార్థుల్లో ప్రతిభకు కొరత లేదని తెలిపారు. వారంలో ఒక రోజు క్రీడలు తప్పనిసరి చేస్తామన్నారు. గచ్చిబౌలి తరహాలో ఒక అంతర్జాతీయ స్టేడియాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ క్రీడాకారులు మన రాష్ట్రానికి వచ్చేలాగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. గతంలో 175 నియోజకవర్గాల పరిధిలో అప్పటి ప్రభుత్వం స్టేడియం నిర్మాణాలను చేపడతామని పేర్కొన్నారని వాటిని పూర్తి చేయడానికి తాము కృషి చేస్తామన్నారు. 
 
71 స్టేడియాల నిర్మాణాలు వివిధ స్థాయిలో ఉన్నాయని, తొలుత వాటిని పూర్తి చేస్తామన్నారు. విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందించేలా ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైతే స్టేడియాలను అద్దెకు తీసుకొని క్రీడలను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రస్ధాయిలో 12 మెగా ఈవెంట్స్ నిర్వహించాలని అధికారులకు సూచనలు ఇచ్చామని ఈ సందర్భంగా  మంత్రి అవంతి శ్రీనివాస్  తెలిపారు. 
 
క్రీడల వలన యువతలో మానసిక రుగ్మతలు తొలగిపోతాయని, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని తద్వారా వారు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించగలుగుతామని మంత్రి తెలిపారు. మూడు విభాగాలలో క్రీడలను జిల్లా స్థాయిల్లో నిర్వహించి వారిలో గెలుపొందిన వారితో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు. పదవ తరగతి వరకు గల విద్యార్థులతో ఒక విభాగం, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థుల్లో మరో విభాగం, యూనివర్సిటీ స్థాయిలో ఇంకో విభాగం ఏర్పాటు ద్వారా క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు. 
 
13 మంది ఉత్తమ క్రీడాకారులను జిల్లా స్థాయిల్లో గుర్తించి వారిని అన్ని విధాల ప్రోత్సహిస్తామన్నారు,. సమగ్ర క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడంలో భాగంగా ప్రతినెలా ప్రతి జిల్లాలో ఒక ఈవెంట్ ను నిర్వహించ తలపెట్టామని ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. 
 
యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిల్లో దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. విధుల్లో నిజాయితీగానూ, నిక్కచ్చిగానూ వ్యవహరించాలని ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగిందన్నారు. క్రీడలను, క్రీడాకారులను గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందని అప్పుడే పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారని అన్నారు. 
 
జిల్లాల నుంచి ఒక యూత్ ఐకాన్ ను గుర్తించి వారితో కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తామన్నారు. యువతలో నానాటికీ పెరుగుతున్న పెడధోరణికి కారణాలను గుర్తించి వారికి విలువలతో కూడిన సమాజం పట్ల అవగాహన కార్యక్రమాలను పెంపొందించాల్సి ఉందన్నారు. ఆదర్శవంతమైన యువతను రూపుదిద్దాల్సింది ఉందని మానవ సంబంధాలను యువతలో పెంపొందించాలన్నారు. ఈ సమావేశంలో క్రీడా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, శాప్ ఎండీ కె.భాస్కర్ పాల్గొన్నారు.
 
టీటీడీలో నూతన సంప్రదాయానికి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి కేంద్రంగా టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయం ఉండనుంది. ఈ మేరకు టీటీడీ కార్యాలయం ఏర్పాటు విషయమై చైర్మన్‌ వైవీ.. అధికారులను ఆదేశించారు. తాడేపల్లి ఆఫీసులో ఆరుగురు ఉద్యోగులను నియమించాలని సర్వీసెస్ డిప్యూటీ ఈఓను విజయవాడ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ రాజేంద్రుడు కోరారు. చైర్మన్ ఆదేశాల మేరకు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే.. 21మంది సిబ్బందితో ఇప్పటికే తిరుమలలో టీటీడీ చైర్మన్‌ ఆఫీసును వైవీ ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు