టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు దేశాలకు అధికారికంగా వెళ్లి వచ్చారు. ఈ పర్యటనల ఖర్చు వివరాలను ప్రస్తుత పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. 2014 జూన్ నుంచి ఏప్రిల్ 2019 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల విదేశీ పర్యటనలపై ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి సభలో ప్రశ్నించారు. ఆయన సంధించిన ప్రశ్నల వివరాలను పరిశీలిస్తే,
* 2014 నవంబరులో సింగపూర్ వెళ్లి ఏపీని టూరిస్ట్ హబ్, జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు అని బాబు ప్రకటన చేశారు.
* 2014 నవంబరులో జపాన్ వెళ్లి మన రాష్ట్ర విద్యాలయాల్లో జపాన్ భాష నేర్పిస్తామని, ఉద్యోగ కల్పన చేస్తామన్నారు.
* 2015 జనవరిలో దావోస్ వెళ్లి బుల్లెట్ ట్రైన్ తెస్తామన్నారు. మలేషియా తరహాలో బుద్ధిజం టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు.
* 2015 ఏప్రిల్‌లో చైనా వెళ్లి షాంఘై తరహాలో అమరావతి నిర్మిస్తామని, ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు చేసి సోలార్ పరిశ్రమలు తెస్తామన్నారు.
* 2015 జులైలో జపాన్ వెళ్లి.. టోక్యోలా అమరావతి నిర్మిస్తామన్నారు. ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కడతామన్నారు. విశ్వనగరంగా అమరావతి అన్నారు. వివిధ రంగాల్లో జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని వాటికోసం ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. వాటి ప్రతిపాదనలు ఎక్కడున్నాయని కాకాణి ప్రశ్నించారు.
* 2015 సెప్టెంబరులో సింగపూర్ వెళ్లారు.విశ్వనగరంగా అమరావతి నిర్మిస్తామన్నారు. రాజమండ్రిలో సోలార్ పవర్ ప్లాంట్, రూ.2,000 కోట్లతో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని అన్నారు.
* 2016 మార్చిలో లండన్ పర్యటనలో అమరావతి నిధుల సమీకరణకు లండన్ స్టాక్ ఎక్చేంజి అంగీకరించిందని చంద్రబాబు అన్నారు.
* 2016లో చైనా పర్యటన చేసి మళ్లీ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ తెస్తామని చంద్రబాబు అన్నారు. రూ.10 వేల కోట్లతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం అన్నారు. కార్గో హబ్‌గా కృష్ణపట్నం, విశాఖ చేస్తామని చంద్రబాబు అన్నారు.
* 2016 జులైలో ఖజకిస్తాన్ వెళ్తే.. ఖజకిస్తాన్‌లా అమరావతిని నిర్మిస్తామని అన్నారు.
* 2016 రష్యా పర్యటన చేశారు. రాష్ట్రంలో మెరైన్ యూనివర్శిటీ తెస్తామని చంద్రబాబు అన్నారు. అమరావతికి మాస్కో సహకారం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు.
* 2017 జనవరిలో శ్రీలంక వెళ్లి శ్రీలంక ద్వీపాల తరహాలో భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ఆనాడు తెలిపారు.
* 2017 జనవరిలో దావోస్ వెళ్లారు. సాంకేతిక ప్రగతికి మైక్రోసాఫ్ట్ సహకారం తీసుకుంటామని అన్నారు. ఫిన్‌టెక్ వ్యాలీలా ఏపీ తయారు చేస్తామని చంద్రబాబు అన్నారు.
* 2017 అక్టోబరులో లండన్ వెళ్లినప్పుడు రాష్ట్రానికి ఏరో సిటీ, నలంద యూనివర్శిటీ, ఆర్గానిక్ పుడ్ ఇండస్ట్రీ తెస్తామని అన్నారు.
దుబాయ్ వెళ్లినప్పుడు ఎమిరేట్స్ సంస్థకు హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. 5 బిలియన్ డాలర్ల ఏవియేషన్ సిటీ ఏర్పాటు అని చంద్రబాబు ప్రకటించారు.
* 2017 డిసెంబరులో దక్షిణ కొరియాకు వెళ్లి ఏపీ రెండో రాజధాని అని చంద్రబాబు ప్రకటించారు. అనంతలో ఫ్రెండ్లీ కాంప్లెక్స్, కొరియా సిటీ తెస్తామని మొత్తం 3 వేల కోట్లు అని ప్రకటించారు.
* 2018 జనవరిలో దావోస్ వెళ్లి పెట్టుబడులు పెట్టమని విజ్ఞప్తి చేశారు. తర్వాత దుబాయ్‌లో చంద్రబాబు పర్యటన చేశారు. ఫోనిక్స్ ఆధ్వర్యంలో అతిపెద్ద రైస్ మిల్లు వస్తోందని అన్నారు. ఇలా చంద్రబాబు విదేశాల్లో పర్యటించారు. వీటి కోసం రూ.39 కోట్లు ఖర్చు చేశారు. దీనివల్ల రాష్ట్రానికి కలిగిన లబ్ధి ఏంటని కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు.
వీటికి మంత్రి గౌతం రెడ్డి సమాధానమిచ్చారు. కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో చంద్రబాబు, మంత్రుల విదేశీ పర్యటనల వివరాలు పరిశీలనలో ఉన్నాయని ఇండస్ట్రియల్ శాఖా మంత్రి గౌతం రెడ్డి సమాధానం ఇచ్చారు. రూ.39 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని దీనిపై లోతైన దర్యాప్తు జరగాలని చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వివరణ ఇస్తూ, చంద్రబాబు 39 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి విదేశీ పర్యటనలు చేశారు. 38సార్లు విదేశీ పర్యటనలు చేశారు. కానీ ప్రక్కన ఉన్న తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు ఎప్పుడైనా విన్నామా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు తిరిగినట్లు తిరగలేదు. దేశ ఐటీ ఎగుమతుల్లో తమిళనాడు దాదాపు పది శాతం ఉన్నా ఏనాడూ చెప్పుకోలేదు. ఐటీ కోసం తిరిగామని చెప్పుకోలేదు. 45 శాతం ఐటీ ఎగుమతులు కర్ణాటక ఉన్నా ఏనాడూ చెప్పుకోలేదు. కానీ మనవాళ్లు తమ వల్లే కంప్యూటర్లు వచ్చాయని చెప్పుకొన్నారని బుగ్గన గారు ఎద్దేవా చేశారు.
అనంతపురంలో కియా మోటార్స్ అనంతపురం రావటానికి స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి కారణమని ఆ సంస్థ సీఈఓ 13జూన్, 2019న హ్యాంగ్ క్యూన్ లీ రాసిన లేఖను సభకు చూపించటమే కాకుండా ఆ లేఖలోని అంశాలను చదివి వినిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారని అందులో లీ తనతో వైయస్ఆర్‌తో ఉన్న 2007 జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. హ్యూందాయ్ ఆర్ అండ్ డీకి హెడ్‌గా నేను ఉన్నానని ఏపీలో ఆటోమొబైల్ పరిశ్రమ పెట్టమని వైయస్ఆర్ కోరారని లేఖలో లీ తెలిపారు.
2007లో వైయస్ఆర్ కోరిక మేరకు అనంతపురంలో కియా మోటార్స్ ఏర్పాటు చేయటం జరిగిందని లేఖలో తెలిపారని బుగ్గన సభలో చదవి వినిపించారు.
ఈఓడీబీ ర్యాంకుల గురించి బుగ్గన గారు సమాధానం ఇస్తూ.. ప్రశ్నలకు సంబంధించి ర్యాంకులు ఇవ్వటమే తప్ప.. ఫెర్ఫార్మెన్స్ బట్టి ఇచ్చేది కాదని బుగ్గన అన్నారు. ఆ రకంగా చూస్తే.. అత్యంత అవినీతి రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ 1 అని ఎన్‌సీఈఆర్ సర్వేలోనూ వెలుగులోకి వచ్చిన విషయాన్ని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు.