కరోనా వ్యాప్తి నివారణకు నిరంతర కృషి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (12:50 IST)
కరోనా వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రత్యేకించి నిరుపేదలకు నిత్యావసర వస్తు పంపిణీ పరంగా స్పష్టమైన కార్యాచరణతో ముందడుగు వేస్తున్నారని గౌరవ గవర్నర్ వివరించారు. 
 
దేశంలోని వివిధ రాష్ట్రాలలో కరోనా స్ధితిగతులను అంచనా వేసి తగిన సూచనలు అందించే క్రమంలో భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడు హస్తిన నుండి ఆయా రాష్ట్రాల గవర్నర్లతో దృశ్య శ్రవణ సదస్సును నిర్వహించారు. విజయవాడ రాజ్ భవన్ నుండి దృశ్య శ్రవణ సదస్సులో పాల్గొన్న గవర్నర్ రాష్ట్రంలోని తాజా పరిస్ధితులను దేశాధ్యక్షునికి వివరించారు.
 
ఈ నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ గడిచిన మూడు రోజులలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఫలితంగా లాక్ డౌన్ సడలింపు సమయాన్ని సైతం తగ్గించి, దానిని మరింత సమర్ధవంతంగా అమలు చేసేలా చర్యలు చేపట్టారన్నారు. 161 పాజిటివ్ కేసులలో 140 మంది జమాతే సదస్సుకు వెళ్లిన వారేనన్నది స్పష్టం అవుతోందని, వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు వ్యాపించకుండా గృహనిర్భంధంలోనే కొనసాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని గవర్నర్  వివరించారు. 
 
దాదాపు ఆరు నిమిషాల సేపు రాష్ట్ర స్ధితిగతులను రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులకు వివరించగా, ప్రత్యేకించి వెంకయ్య నాయిడు రాష్ట్రంలో వ్యవసాయ రంగంకు సంబంధించిన పరిస్ధితులపై ఆరా తీసారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం విక్రయాలు జరిగే సీజన్ నడుస్తున్నందున వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందన్న దానిపై ఉపరాష్ట్రపతి ఆసక్తి కనబరిచారు. వివిధ రకాల వాణిజ్య పంటలకు సైతం ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉందని, రైతులు వాటి విక్రయాలు, రవాణాలకు సంబంధించి ఇబ్బంధి పడకుండా చూడాలని ఆకాంక్షించారు.
 
గవర్నర్ మరిన్ని వివరాలను అందిస్తూ ప్రభుత్వం పరంగా చేపట్ట వలసిన నిర్ధిష్ట చర్యలను సిఫార్సు చేస్తామన్నారు. రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టేలా వారికి లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇచ్చామని, అయితే సామాజిక దూరంతో పనులు సాగేలా చూసుకోవాలన్న విషయాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు ఈ దృశ్య శ్రవణ సదస్సు జరగగా, రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్లకు నిర్దేశిత సమయం కేటాయించి తాజా స్ధితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేసారు. సమావేశంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు