గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార సంస్థలు కీలక పాత్ర: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్

సోమవారం, 23 నవంబరు 2020 (20:17 IST)
దేశం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను సమగ్రంగా సుస్థిరపరచటంలో సహకార వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సోమవారం మహారాష్ట్ర, పూణేలోని వైకుంత్ మెహతా జాతీయ సహకార నిర్వహణా సంస్ధ స్నాతకోత్సవంలో విజయవాడ రాజ్ భవన్ నుండి గౌరవ గవర్నర్ వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. 
 
బొంబాయి రాష్ట్రంలో ఆర్థిక, సహకార మంత్రిగా పనిచేసి, ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌గా పనిచేసిన వైకుంత్ మెహతా పేరు ఈ సంస్ధకు నామకరణం చేయగా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో రెండేళ్ల పూర్తికాల వ్యవసాయ-వ్యాపార నిర్వహణ కోర్సును అందిస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నిర్వహణ, విద్య, పరిశోధన తదితర రంగాలలో ప్రభుత్వం, సహకార సంస్థలు,కార్పొరేట్ సంస్థలకు సేవలను అందించేలా వివిధ స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను అందించటం శుభపరిణామమన్నారు.
 
వ్యవసాయం, గ్రామీణ రంగాల అభివృద్ధికి, భారత దేశంలోని వివిధ సహకార సంస్థల పురోగతికి ఈ సంస్థ సహకరిస్తోందన్నారు. స్థానిక మానవ వనరులను ఏకీకృతం చేయడానికి, గ్రామీణ భారతదేశం యొక్క వృద్ధికి శక్తినిచ్చే సహాయకారిగా సహకార ఉద్యమం పనిచేస్తుందన్నారు. దేశంలో 8 లక్షలకు పైగా సహకార సంస్థలు ఉండగా, వారు అన్ని రంగాలలో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నారని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు.
 
దేశంలో పాల విప్లవానికి పాడి సహకార సంస్థలు కారణమయ్యాయని, ఇఫ్కో, క్రిబ్కో, అముల్ వంటి సంస్థలు సహకార రంగంలో పెద్ద విజయ గాధలుగా మారాయని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో పట్టణ సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, హౌసింగ్ , మత్స్య సంఘాలు గ్రామీణ ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి దోహదం చేస్తున్నాయన్నారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా 14 ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్లు (ఐసిఎం), ఐదు రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్లు (ఆర్‌ఐసిఎం) లకు ఈ సంస్థ క్రియాశీల సహకారం, మార్గదర్శకత్వం అందించటం ముదావహమని గవర్నర్ వివరించారు.
 
నూతన వ్యవసాయ చట్టం 2020 ద్వారా వ్యవసాయ రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణల నేపథ్యంలో వైకుంఠ మేహతా జాతీయ సహకార నిర్వహణా సంస్ధ పాత్ర ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుందని గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం అగ్రి-బిజినెస్ ఒక ముఖ్యమైన రంగంగా ఉందని, ఈ రంగానికి ప్రోత్సాహాన్ని అందించే క్రమంలో పర్యవేక్షక, నిర్వాహక, కార్మికుల స్థాయిలో నైపుణ్యం కలిగిన మానవశక్తి అవసరం ఉందని, ఈ వైపుగా సహకార విద్యా సంస్ధలు తప్పనిసరిగా మెరుగైన పనితీరును ప్రదర్శించాలని సూచించారు.
 
అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో రెండు సంవత్సరాల పూర్తి కాలపు రెసిడెన్షియల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పిజిడిఎం),  అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఎబిఎం) కోర్సులను ఎంబీఏతో సమానమైన డిగ్రీలుగా అందించడం ద్వారా సంస్ధ మార్గదర్శక పాత్రను పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, వైకుంఠ మేహతా జాతీయ సహకార నిర్వహణా సంస్ధ డైరెక్టర్ డాక్టర్ కె.కె. త్రిపాఠి, జాయింట్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ డి. రవి, రాజ్ భవన్ అధికారులు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు