కరోనావైరస్: జంగారెడ్డిగూడెంలో చిరంజీవి ఆసుపత్రిలో చార్జీల బాదుడు, 9 ఆస్పత్రులు అవకతవకలు

శనివారం, 15 మే 2021 (12:14 IST)
రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజుల్లో మొత్తం 13 ఆస్పత్రులను తనిఖీ చేసి 9 ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడట్లు నిర్ధారించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ. రాజేంద్రనాథ్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు గురువారం(13.5.21), శుక్రవారాల్లో(14.5.21) కూడా తనిఖీలు నిర్వహించినట్లు, మొత్తంగా ఇప్పటివరకు మొత్తం 46 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నట్లు గుర్తించి ఐదుగురిపై ప్రత్యేక కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అందులో రెండు నెల్లూరులో, రెండు విజయవాడలో కాగా, ఒక కేసు విశాఖపట్టణంలో నమోదు చేసినట్లు ఆయన  వెల్లడించారు.
 
కేసులు నమోదు చేయబడిన ఈ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ధేశించిన రేట్ల కంటే అధిక మొత్తం వసూలు చేయడం, అర్హత ఉన్న రోగులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సను నిరాకరించడం, ఆరోగ్యశ్రీ క్రింద రోగుల నుండి డబ్బులు వసూలు చేయడం, కేటాయించిన రెమిడిసివిర్ ఇంజక్షన్లను దుర్వినియోగం మరియు అధిక ధరలకు అమ్మడం చేస్తున్నట్లు తమ తనిఖీల్లో గుర్తించామన్నారు.
 
ఇప్పటి వరకు 46 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు కాగా, వీటిలో గుంటూరు జిల్లాలోని అంజి రెడ్డి ఆసుపత్రిపై రెండు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చికిత్స అందించాలని యజమాన్యాన్ని హెచ్చరిస్తూ  05.05.21వ తేదీన పిడుగురాళ్ల బ్రాంచ్ లో ఒక కేసు నమోదు కాగా మరో కేసు నరసరావుపేటలోని ఇదే బ్రాంచ్ లో అనుమతి లేకుండా రోగులకు చికిత్స అందిస్తున్నారని, 5 రోజుల చికిత్సకు గానూ రోగుల నుండి 3,38,000 రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు.

అంతేగాక రోగులను స్వంతంగా రెమిడిసివిర్ ఇంజక్షన్లను తెచ్చుకోమని సూచించినందుకు గానూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే అంజిరెడ్డి ఆస్పత్రిపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదైనందు వల్ల ఆస్పత్రి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని నిర్ణయించామన్నారు. అదే విధంగా ఆస్పత్రి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
 
అన్ని ఆసుపత్రులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ. రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. 30.04.2021న విడుదల చేసిన జీవో ఆర్టీ నంబర్ 185, 07.05.2021న విడుదల చేసిన జీవో ఆర్టీ నంబర్ 210 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆరోగ్యశ్రీ  క్రింద అర్హులైన కోవిడ్ రోగులకు ఉచిత చికిత్స అందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
 
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్న అంజిరెడ్డి హాస్పిటల్ నందు అనుమతి లేకుండా కరోనా చికిత్సలు నిర్వహిస్తుండటం, రోగులకు రెమిడిసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేయకపోవడం  ప్రభుత్వం నిర్ధేశించిన రేట్ల కంటే అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించి ఐపీసీ సెక్షన్లు 188, 384, 420 తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 51(బి) క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ. రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
 
విశాఖపట్టణంలోని ఆదిత్య హాస్పిటల్ నందు అనుమతి లేకుండా కరోనా చికిత్సలు నిర్వహిస్తుండటం, రెమిడిసివిర్ ఇంజక్షన్లను దుర్వినియోగం చేస్తుండటం, ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 342, 384, 420, 509 తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్లు 51(బి) క్రింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
 
విశాఖపట్టణం జిల్లా దుర్గా హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీకి అర్హత గల రోగుల నుండి డబ్బులు వసూలు చేయడం, ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయడం, రోగులను భయాందోళనలకు గురిచేయడం, నిరుత్సాహానికి గురిచేస్తున్నట్లు  గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్లు 51(బి), 53 క్రింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
 
విశాఖపట్టణం జిల్లాలో  రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నట్లు గుర్తించి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 420, 7(1) ఈసీ యాక్ట్  క్రింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో నలుగురు వ్యక్తులు  రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తుండటంతో వారిపై  ఐపీసీ సెక్షన్ 420, 7(1) ఈసీ యాక్ట్  క్రింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
 
నెల్లూరు జిల్లాలో  రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నట్లు గుర్తించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్  420, ఈసీ యాక్ట్ 7(1)  క్రింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కడపలోని సంజీవని హాస్పిటల్ నందు  అనుమతి లేకుండా కోవిడ్ చికిత్సలు నిర్వహిస్తున్నందుకు, ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420 తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 51(బి), 53 క్రింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
 
విజయవాడ భవానిపురంలోని ఆంధ్రా హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ పథకం క్రింద రోగులను చేర్చుకోవడం లేదని, ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని, రోగులకు చికిత్సకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడం లేదని గుర్తించి ఐపీసీ సెక్షన్ 188, 420 లతో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ సెక్షన్ 51(బి) క్రింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
 
విజయవాడలో  రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నట్లు గుర్తించి నలుగురు నిందితులను  అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 188, 420, ఈసీ యాక్ట్ 6(1), 7(1) తో పాటు  డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ సెక్షన్ 51 క్రింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
 
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ అయినోదయ హాస్పిటల్ నందు అనుమతి లేకుండా కరోనా చికిత్సలు నిర్వహిస్తుండటం, చికిత్సకు సంబంధించిన రికార్డులు, బిల్లులను నమోదు చేయకపోవడం, సాధారణ రోగులతో పాటే కరోనా రోగులను ఉంచడం, వ్యాధి వ్యాప్తి జరగకుండా తగు చర్యలు తీసుకోకపోవడం గుర్తించి  ఐపీసీ సెక్షన్ 188, డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 53 తో పాటు డ్రగ్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ 18(బి)  క్రింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
 
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో గల కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ నందు అనుమతి లేకుండా కరోనా చికిత్సలు నిర్వహిస్తుండటం, చికిత్సకు సంబంధించిన రికార్డులు, బిల్లులను నమోదు చేయకపోవడం, సాధారణ రోగులతో పాటే కరోనా రోగులను ఉంచడం, వ్యాధి వ్యాప్తి జరగకుండా తగు చర్యలు తీసుకోకపోవడం గుర్తించి  ఐపీసీ సెక్షన్ 188, 269, 420 తో పాటు  డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 51(బి) క్రింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
 
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో గల ఆంధ్రా హాస్పిటల్ నందు  ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధిక ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్య శ్రీ క్రింద చికిత్సను నిరాకరించడం, ప్రైవేట్ రోగులను అడ్మిట్ చేసుకోవడం, రెమిడిసివిర్ ఇంజక్షన్లను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించి  ఐపీసీ సెక్షన్ 188,420 తో పాటు  డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 51(బి), 53 క్రింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
 
పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో గల చిరంజీవి హాస్పిటల్ నందు  ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధిక ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సను నిరాకరించడం, ప్రైవేట్ రోగులను అడ్మిట్ చేసుకోవడం, పేమెంట్ విధానంలో చెల్లింపులకు బిల్లులు ఇవ్వటం లేదని గుర్తించి  ఐపీసీ సెక్షన్ 188,420 తో పాటు  డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 51(బి) క్రింద కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ. రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు