నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

ఠాగూర్

సోమవారం, 4 ఆగస్టు 2025 (17:20 IST)
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జునపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. మేమిద్దరం 33 యేళ్ల క్రితం కలిశామని, అపుడు ఆయన ఎలా ఉన్నారో ఇపుడు కూడా ఆయన అలానే ఉన్నారన్నారు. పైగా, నా వెంట్రుకలన్నీ రాలిపోయానని, నాగార్జున మాత్రం ఇప్పటికే అలానే ఉన్నారన్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం "కూలీ". ఈ నెల 14వ తేదీన పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 2వ తేదీన చెన్నైలో రిలీజ్ చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఒక స్పెషల్ వీడియోతో తెలుగువారిని పలుకరించారు. 
 
"తెలుగు సినీ ప్రేక్షకులకు నా నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 యేళ్లు అయింది. ఈ యేడాదిలో లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నేను నటించిన చిత్రం 'కూలీ'. ఈ నెల 14వ తేదీన విడుదలకానుంది. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్ కనకరాజ్ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్. ఈ చిత్రంలో విలన్ పాత్రను నాగార్జున చేశారు. అసలు కూలీ సబ్జెక్ట్ విన్నవెంటనే సైమన్ పాత్రను నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా అని ఎదురు చూశాను.. ఎందుకంటే అది చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆర్నెల్ల పాటు సరైన నటుడు కోసం గాలించాం.
Rajinikanth Coolie trailer announcement poster
 
ఈ పాత్ర కోసం ఒక నటుడుతో ఆరుసార్లు సిటింగ్ జరిగింది. అయినా ఓకే అవలేదు అని లోకేశ్ నాతో చెప్పారు. ఎవరు ఆయన అని అడగ్గా.. నాగార్జున పేరు చెప్పగానే ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అంగీకరించారని తెలిసి సంతోషించాను. ఎందుకంటే ఆయన డబ్బు కోసం నటించే వ్యక్తి కాదు. ఆయనకు ఆ అవసరం కూడా లేదు. ఎపుడూ మంచివాడిగానే చేయలా? అని ఆయన సైమన్ పాత్రను అంగీకరించి ఉంటారు. మేమిద్దరం 33 యేళ్ల క్రితం ఒక సినిమా చేశాం. అపుడు ఎలా ఉన్నారో... ఇపుడూ అలానే ఉన్నారు. నాకు జుట్టు కూడా ఊడిపోయింది. నాగార్జున మాత్రం అలానే ఉన్నారు. 
 
నాగార్జునతో పనిచేస్తుండగా, మీ ఆరోగ్యం రహస్యం ఏంటి అని అడిగాను... ఏమీ లేదు సర్.. వ్యాయామం, ఈత, కొద్దిగా డైట్, సాయంత్రం 6 గంటలకు డిన్నర్ అయిపోతుంది. మా తండ్రి నుంచి వచ్చిన జీన్స్ కూడా ఒక కారణం కావొచ్చు. దాంతో పాటు తా తండ్రి నాకో సలహా ఇచ్చారు. బయట విషయాలు తలలో ఎక్కించుకోవద్దని చెప్పారు. అని నాగార్జున నాతో చెప్పారు. 17 రోజుల పాటు థాయ్‌కు మేమిద్దరం షూటింగుకు వెళ్లాం. అది నా జీవితంలో మరిచిపోలేనిది. సైమన్ పాత్ర ఆయన నటన చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది. బాషా - ఆంటోనీ ఎలాగో, కూలీ - సైమన్ అలాం ఉంటుంది. అనిరుధ్ సంగీతం చాలా బాగుంటుంది అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు