కరోనా వైరస్ అంటే సాధారణ జ్వరం కాదు... పవన్ కళ్యాణ్

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (20:38 IST)
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ అంటే సాధారణం జ్వరం కాదని చెప్పుకొచ్చారు. 
 
కరోనా వైరస్ ఎవరికైనా వస్తుంది... పోతుంది.. ఇది భయంకరమైన రోగం కాదు అని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి పవన్ పవన్ కళ్యాణ్ కౌంటరిచ్చారు. 
 
'మనం అనుకుంటున్నట్టు కొవిడ్-19 (కరోనా) సాధారణ జ్వరం కాదు. కొవిడ్-19 వైరస్ కారణంగా రోగుల ఊపిరితిత్తులకు తీవ్రస్థాయిలో నష్టం కలుగుతోందని చైనాలో అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కావాలంటే 'సైన్స్ న్యూస్'లో వచ్చిన ఈ కథనం చదువుకోండి' అంటూ సదరు లింకును కూడా పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇకపోతే, రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందికి 1504 కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో 10 లక్షల మందికి 1103 పరీక్షలు, రాజస్థాన్‌లో 1,077 పరీక్షలు చేశారని తెలిపారు. 
 
కరోనా పాజిటివ్ రేటు కూడా ఏపీలో తక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 80,334 కరోనా పరీక్షలు చేసి 1259 పాజిటివ్ కేసులు ఉన్నట్టు తేల్చామని, దేశవ్యాప్తంగా 7,16,733 పరీక్షలు చేశారని, వీటిలో 29,572 కేసులు పాజిటివ్‌గా తేలాయని అన్నారు.
 
అలాగే, ఇప్పటివరకు రాష్ట్రంలో జరిపిన పరీక్షల్లో 79075 శాంపిళ్లను నెగిటివ్‌గా వచ్చాయని తెలిపారు. ఎన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తే, అంత త్వరగా రోగులను గుర్తించే వీలుంటుందని, ఈ విషయంలో రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. 10 లక్షల మంది జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నది మన రాష్ట్రమేనని జవహర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు