ఐటిఐ వంటి కోర్సులు చదివినా ఉపాధి అవకాశాలు: జగన్.. పీపీఈ కిట్ల ఆవిష్కరణ
సోమవారం, 29 జూన్ 2020 (18:57 IST)
పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉండటంతో పాటు చేయూత ఇస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పష్టం చేశారు. చిన్న పరిశ్రమలు బాగుంటేనే రాష్ట్రాభివృద్ధిలో వేగం ఉంటుందన్న ఆయన, ఈ ఏడాది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎం)కు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు.
అదే విధంగా వచ్చే ఏడాది స్పిన్నింగ్ మిల్లులకు చేయూతనిస్తామని, వాటికీ దాదాపు రూ.1000 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. పరిశ్రమలకు గత ప్రభుత్వం దాదాపు రూ.4 వేల కోట్లు బకాయి పెట్టిందని, వాటన్నింటినీ తాము చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
మాట మీద నిలబడితేనే పెట్టుబడులు వస్తాయన్న ఆయన, ఆ దిశగా ప్రభుత్వం పూర్తి చొరవ చూపుతుందని వెల్లడించారు. చిన్న చిన్న పరిశ్రమల వల్ల గ్రామాల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయని, ఐటిఐ వంటి కోర్సులు చదివినా ఉపాధి అవకాశాలు ఉంటాయని సీఎం చెప్పారు.
రాయితీల రూపంలో ఎంఎస్‌ఎంఈలకు గత టీడీపీ ప్రభుత్వం బకాయి పడిన మొత్తాలను చెల్లిస్తున్న ప్రభుత్వం అందుకోసం రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించింది. అందులో భాగంగా మే నెలలో తొలి విడతగా రూ.450 కోట్లు చెల్లించిన ప్రభుత్వం, రెండో విడత కింద ఇవాళ రూ.512.35 కోట్లు విడుదల చేసింది.
క్యాంప్ కార్యాలయంలో సోమవారం కంప్యూటర్‌లో బటన్ నొక్కిన సీఎం, లబ్ధిదారుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేశారు. ఆ తర్వాత జిల్లాలలో ఉన్న లబ్ధిదారులతో సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు:
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగంలో మొత్తం 97,428 యూనిట్లు ఉండగా, వాటిలో 72,531 సూక్ష్మ పరిశ్రమలు కాగా, 24,252 చిన్న పరిశ్రమలు, మరో 645 మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. వాటి ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు.
రీస్టార్ట్ ప్యాకేజీ.
ఎంఎస్‌ఎంఈ రంగానికి గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రాయితీలను చెల్లిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం మే నెలలో రూ.450 కోట్లు మొదటి విడతగా ఇవ్వగా, ఇవాళ రూ.512.35 కోట్లు రెండో దఫా రీస్టార్ట్ ప్యాకేజీలో ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ రంగం ఎంతో కీలకం:
చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం తోడుగా ఉంటేనే అవి మనుగడ కొనసాగిస్తాయన్న సీఎం, తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి, చివరకు మారుమూల గ్రామాలలో కూడా చిన్న చిన్న పరిశ్రమల ద్వారానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఐటిఐ, డిప్లొమా చదివిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేయూత:
గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు రాయితీల రూపంలో రూ.800 కోట్లకు పైగా బకాయి పడిందని సీఎం వైయస్ జగన్ తెలిపారు. అవన్నీ పూర్తిగా తీర్చడంతో పాటు, కోవిడ్–19, లాక్‌డౌన్ వల్ల ఆ పరిశ్రమలకు వెసులుబాటు కల్పించేందుకు దాదాపు రూ.188 కోట్ల మూడు నెలల విద్యుత్ ఫిక్స్‌డ్ ఛార్జీలు మాఫీ చేశామని గుర్తు చేశారు.
ఇంకా రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్‌ఎఫ్‌సీ) ద్వారా రూ.200 కోట్ల వరకు పరిశ్రమలకు వెసులుబాటు కల్పించామని, ఆయా పరిశ్రమలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అతి తక్కువ వడ్డీ (6 నుంచి 8 శాతం) తో వర్కింగ్ క్యాపిటల్‌గా రుణ మంజూరు చేశామని తెలిపారు. రుణాల చెల్లింపులపై 6 నెలల మారటోరియమ్‌తో పాటు, మూడేళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించామని వివరించారు.
కొనుగోళ్లలోనూ ప్రాధాన్యం:
ప్రభుత్వానికి ఏటా అవసరమైన దాదాపు 360 రకాల వస్తువులు, ఇతర సామాగ్రిలో 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచి తీసుకోవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన కంపెనీలు, మరో 3 శాతం మహిళలకు చెందిన యూనిట్ల నుంచి సేకరించాలని దిశా నిర్దేశం చేశామని చెప్పారు. ఇంకా వాటన్నింటికి 45 రోజుల్లోనే బిల్లులు చెల్లించాలని ఆదేశించామని వెల్లడించారు.
రూ.1100 కోట్లతో కార్యక్రమం:
చిన్న చిన్న పరిశ్రమలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, వేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకే దాదాపు రూ.1100 కోట్లతో ఈ ఏడాది కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు.
వచ్చే ఏడాది?:
వచ్చే ఏడాది స్పిన్నింగ్ మిల్లులకు చేయూత ఇస్తామన్న సీఎం, వాటికి కూడా దాదాపు రూ.1000 కోట్లు బకాయిలు చెల్లిస్తామనిచెప్పారు. ఆ విధంగా ఏటా ఒక రంగానికి చేయూతనిస్తామని తెలిపారు.
ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా..!:
గత ప్రభుత్వం పరిశ్రమలకు దాదాపు రూ.4 వేల కోట్ల బకాయి పెట్టిందన్న ముఖ్యమంత్రి, వాటన్నింటినీ చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థికస్థితి బాగా లేకున్నా, ఈ ఏడాది ఎంఎస్‌ఎంఈలకు సహాయం చేశామని గుర్తు చేశారు.
గత ప్రభుత్వ బకాయిలు రూ.827 కోట్లు తీర్చడమే కాకుండా, మొత్తం రూ.1100 కోట్లతో కార్యక్రమం చేపట్టామని చెప్పారు.
అప్పుడే పెట్టుబడులు వస్తాయి:
ప్రభుత్వం మాట మీద నిలబడితేనే, ఎవరైనా పెట్టుబడులకు ముందుకు వస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ దిశలో ప్రభుత్వం పూర్తి చేయూత ఇస్తుందని, పారిశ్రామిక రంగానికి అండగా నిలుస్తుందని సీఎం వెల్లడించారు.
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు, పలువురు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పీపీఈ కిట్ల ఆవిష్కరణ:
చివరగా ఏపీ మెడ్ టెక్ జోన్ (ఏఎంటీజడ్) కోవిడ్–19 నివారణ, నియంత్రణ కోసం తయారు చేసిన వ్యక్తిగత భద్రత ఉపకరణాలు (పీపీఈ కిట్లు), ఎన్–95 మాస్కులు, లేబరేటరీ పరీక్ష ఉపకరణాలను సీఎం వైయస్ జగన్, ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.